తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలి

Dec 21,2023 16:22 #Dharna, #Kurnool
  • రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల నిరసన

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌ (కర్నూలు) : కరువుతో అల్లాడిపోతున్న రైతులను, కౌలు రైతులను, వ్యవసాయ కూలీలను తక్షణమే ఆదుకోవాలని కోరుతూ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గనేకల్లు, కుప్పగల్లు, జాలిమంచి, దొడ్డనకేరి, మాంత్రికి, సంతేకూడ్లూరు,పెద్దహారివాణం,డాణాపురం, సచివాలయాల ఎదుట ఆందోళన నిర్వహించి, ఆయా సచివాలయాల అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే.లింగన్న మాట్లాడుతూ.. జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొని పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, దిగుబడి పూర్తిగా తగ్గిపోయి రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిపై ఆధారపడిన వ్యవసాయ కూలీలు మరింత నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరువు సమయంలో ఉదారంగా ఆదుకోవలసిన ప్రభుత్వం కేవలం కరువు మండలాలు మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకోవడం సరికాదని, తక్షణమే కరువు సహాయక చర్యలు భాగంగా ప్రతి ఎకరాకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం 25వేల నుండి 50 వేల రూపాయల వరకు పంట నష్టపరిహారం ఇవ్వాలని, పశువులకు పశుగ్రాసం అందించాలని, బ్యాంకు రుణాలు రద్దు చేయాలని, ఉపాధి హామీ పనులు 200 రోజులకు పెంచాలని, 600 వేతనం వచ్చే విధంగా చూడాలని, నిత్యవసర వస్తువుల సరుకులు ఆరు నెలలు పాటు ఉచితంగా ప్రతి పేద కుటుంబానికి ఇవ్వాలని,పెండింగ్లో ఉన్న సుమారు 8 నుండి 10 వారాల ఉపాధి వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు కే.శేఖర్‌, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు రంగనాథ్‌, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం మండల నాయకులు గోవిందు, హనుమంత్‌ రెడ్డి, భాష, వెంకటేశు కమల్నాథ్‌, నర్సింలు హుసేని ఆయా గ్రామాల, రైతులు, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు.

➡️