వేసవిలో నీటిని ఎక్కువగా తీసుకోవాలి

Apr 21,2024 22:17

సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ పరిమి వినోద్‌

ప్రజాశక్తి – నిడదవోలు

వేసవిలో నీటిని ఎక్కువగా తీసుకోవాలని స్వాతి హాస్పిటల్‌ డాక్టర్‌ పరిమి వినోద్‌ అన్నారు. గాంధీనగర్‌ వాకర్స్‌ క్లబ్‌, మహిళా వాకర్స్‌ క్లబ్బుల నాలుగో సర్వసభ్య సమావేశం ఆదివారం రాజేశ్వరి రామకష్ణ లైన్స్‌ కంటి హాస్పిటల్‌ నందు నిర్వహించారు. ఈ సమావేశానికి డాక్టర్‌ పరిమి వినోద్‌ హాజరై ఆరోగ్యకరంగా ఉండటానికి అవసరమైన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంట గంటకు నీళ్లు తాగాలన్నారు. అయితే వేడి ఎక్కువగా ఉందని మరీ చల్లగా ఉండే నీళ్లు తాగకూడదన్నారు. తీయదనం కోసం కూల్‌ డ్రింక్స్‌, ఎనర్జీ డ్రింక్స్‌ ఆర్టిఫిషియల్‌ జ్యూసులు తాగకూడదు అన్నారు. టీ, కాఫీలు, కూడా తగ్గించాలన్నారు. ఇవి ఎక్కువగా తాగడం వల్ల దాహం తీరదని, పైగా మరింత పెరుగుతుంది అని అన్నారు. వీటిలో ఉండే కెమికల్స్‌, చక్కెర ఎండ దెబ్బకు గురై దాహాన్ని పెంచుతాయని అన్నారు. అందుకే వేసవిలో చెమట రూపంలో వెళ్లిపోయిన నీటిని భర్తీ చేసే డ్రింక్స్‌ ఎక్కువగా తాగాలని, లేదంటే డి హైడ్రేషన్‌ బారిన పడే ప్రమాదం ఉంది అని అన్నారు. కొబ్బరినీళ్లు, చెరుకు రసం, మజ్జిగ, లస్సి, పళ్ళ రసాలు, నిమ్మరసాలు వంటి సోడియం , పొటాషియం ఉండే డ్రింక్స్‌ తాగితే లాభం ఎక్కువగా ఉంటుందని అన్నారు. అనంతరం వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ పరిమి వినోద్‌ కు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌ ఖండవల్లి మాణిక్యాలరావు, జిల్లా గవర్నర్‌ శనగన కష్ణమూర్తి, సెక్రెటరీ నారాయణ, మరియు మహిళా వాకర్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

➡️