సామాన్యుని సందేహాలు…!

Mar 11,2024 10:41 #common man, #Doubts

            రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా పని చేయాలని నిర్ణయించినట్టు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారంనాడు ఢిల్లీలో మీడియాతో చెప్పారు. అయితే ఆ మూడు పార్టీల కూటమివల్ల రాష్ట్ర ప్రయోజనాలు ఏమి నెరవేరుతాయో, అదెలాగో మాట మాత్రంగా కూడా ఆయన చెప్పకపోవడంతో సామాన్యులకు పలు సందేహాలు కలుగుతున్నాయి. ఐదేళ్ల క్రితం ధర్మ పోరాట దీక్ష పేరిట భారీ బహిరంగసభలు నిర్వహించి రాష్ట్రానికి బిజెపి చేసిన ద్రోహాన్ని విమర్శించిన చంద్రబాబుకు ఇప్పుడు బిజెపిలో ఏం మార్పు కనిపించింది? ‘దేశమంటే మట్టి కాదోరు దేశమంటే మనుషులోరు’ అన్న మహాకవి గురజాడ సూక్తి ప్రకారం ఈ నిర్ణయంవల్ల ప్రజల ప్రయోజనాలు ఏవైనా నెరవేరుతాయా… లేక అధినాయకత్వానికి లేదంటే కొందరు నాయకుల ప్రయోజనాలు నెరవేరుతాయా అన్నది అసలు ప్రశ్న. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీకి అధినేతగా వున్న చంద్రబాబు పొత్తుపై ఢిల్లీ పాలకుల నిర్ణయం కోసం రెండు రోజులపాటు వారి గడప ముంగిట పడిగాపులు కాయడం పలువురిని కలచివేసింది.

                                                                              ప్రత్యేక హోదా ఏమైనట్టు..!

విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పన కీలక సమస్య. అది ముగిసిన అధ్యాయం అని చెప్పిన బిజెపి ఇప్పుడు తన వైఖరి మార్చుకుందా? ఎపికి హోదా మంజూరు చేస్తామని మాట ఇచ్చిందా? ఇవ్వదని తెలిసినా టిడిపి, పాచిపోయిన లడ్డూలని ఒకనాడు విమర్శించిన జనసేన ఇప్పుడు పొత్తు కుదుర్చుకున్నాయా?

                                                                          విశాఖ ఉక్కు సంగతేమిటి..?

‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ అంటూ 32 మంది ప్రాణ బలిదానంతో సాధించుకున్న ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేస్తామని బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి వ్యతిరేకంగా దాదాపు మూడేళ్లకు పైగా ఉక్కు కార్మికులు పోరాడుతుంటే వివిధ సందర్భాల్లో రాష్ట్ర ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారు. ప్రజల వ్యతిరేకత మూలంగా ప్లాంటు మొత్తాన్ని ఒకేసారి ప్రైవేటుపరం చేయలేని కేంద్రం ముక్కలు ముక్కలుగా అమ్మేయాలని ఒక బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను జిందాల్‌కు అప్పగించింది. ఇప్పుడేమైనా బిజెపి తన ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుందా? విశాఖ స్టీల్‌కు కీలకమైన సొంత గనుల కేటాయింపునకు కేంద్రం అంగీకరించిందా? అలా కాకపోతే ‘ఉక్కు’ ఏమైపోయినాగాని ఆ పార్టీలకు పొత్తే ప్రధానమా?

                                                                                 పోలవరం మాటేమిటి..!

గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడానికి, కరువు పీడిత రాయలసీమకు నికర జలాలివ్వడానికి రాష్ట్రానికి జీవధారగా పోలవరం ప్రాజెక్టును పేర్కొంటారు. అందుకు సంబంధించిన డ్యామ్‌, ఇతర కట్టడాలు, కాల్వల పనులు చేశారేతప్ప సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. రాష్ట్ర విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్నప్పటికీ నిర్వాసితులకు ప్యాకేజి, నిర్మాణ అంచనాలపైనా కేంద్రం కొర్రీలు వేయడమేతప్ప తగిన నిధులివ్వడం లేదు. తాజా అంచనాలతో నిర్మాణ వ్యయాన్ని, పునరావాస పునర్నిర్మాణ ప్యాకేజిని కేంద్రమే పూర్తిగా భరిస్తుందనీ బిజెపి చంద్రబాబుకు మాట ఇచ్చిందా? అలాంటిదేమీ లేకుండానే మూడు పార్టీల కూటమి పాట పాడుతున్నారా?

                                                                                    కడప ఉక్కు ఊసేదీ..!

కడపలో ప్రభుత్వరంగ ఉక్కు కర్మాగార నిర్మిస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారు. కానీ ఈ పదేళ్లలో దాని ఊసే లేదు. కేంద్రాన్ని నిలవెయ్యడం మానేసి గతంలో టిడిపి, ఆ తరువాత వైసిపి ప్రభుత్వాలు ప్రైవేటు రంగంలో నిర్మాణానికి శంకుస్థాపనలు చేయడం తప్ప ముందడుగు లేదు. రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి ప్రధానమైన కడప ఉక్కుపై బిజెపి ఏమైనా పెదవి విప్పిందా? మూడు వేలకోట్ల రూపాయలకుపైగా వెచ్చించి నిర్మిస్తామన్న మన్నవరం ప్రాజెక్టు గురించి కేంద్ర ప్రభువులు ఏమైనా చెప్పారా? ఇవేవీ లేకుండా సీమ అభివృద్ధి మాటలకే పరిమితమా?

                                                                         రాజధాని అంటే మట్టి, నీళ్లా..?

ఢిల్లీ తలదన్నే రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందని గొప్పగా చెప్పిన ప్రధాని మోడీ అమరావతికి పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చి పోయారుతప్ప మహానగర నిర్మాణానికి వలయు నిధులివ్వలేదు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధానిగా ఉండాలని అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసినా వైసిపి సర్కారు మూడు రాజధానుల పేరిట గందరగోళం సృష్టించింది. అప్పుడు కూడా రాజధాని అమరావతి కొనసాగాలని చెప్పలేదు సరికదా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటుందని వైసిపి విధానాన్ని పరోక్షంగా సమర్ధిస్తూ మోడీ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన మాట నిజం కాదా? మరి ఆ వైఖరిని ఇప్పుడు మార్చుకుం టానని బిజెపి స్పష్టం చేసిందా? అలా కాకపోతే అమరావతి రైతులకు, ప్రజలకూ టిడిపి, జనసేన ఏం చెబుతాయి?

                                                                             ఎన్‌డిఎ తో సామాజిక న్యాయమా..!

మోడీ అధికారానికి వచ్చిన ఏడాదికే ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టానికి సవరణ తెచ్చారు. అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. రాజ్యాంగంలోని 370 అధికరణం రద్దు, జమ్ము కాశ్మీర్‌ ను ముక్కలు చేయడం చూశాం. మైనారిటీలపై సిఎఎ, ఎన్‌ఆర్‌సి కత్తి దూశారు. దేశానికి మాయనిమచ్చ లాంటి మణిపూర్‌ మారణహౌమం గురించి చెప్పనక్కరలేదు. తాజాగా ఏకరూప పౌర స్మృతిని రుద్దడానికి యత్నిస్తున్నారు. అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట పేరుతో ఊరూరా మత విద్వేషం రెచ్చగొట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అణగారిన తరగతులవారిపై దాడులు, హత్యాచారాలు సాగుతున్నాయి. ఇదంతా ఎన్‌డిఎ పాలన నిర్వాకమే కదా! అయినా, ‘మేం ఎన్‌డిఎ లో చేరిన విషయాన్ని మైనారిటీలు అర్థం చేసుకుంటారు.’ అని చంద్రబాబు చెప్పడం మైనారిటీలను, అణగారిన సామాజిక తరగతులను మభ్యపుచ్చడమే!

                                                                                  ఎందుకీ ఆత్మవంచన..!

తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకునిగా ఉన్న చంద్రబాబు నాయుడ్ని సిఐడి పోలీసులు అర్ధరాత్రి వేళ భీతావహం సృష్టించి అరెస్టు చేశారు. అయితే ఆ కేసులో ప్రాథమిక ఆధారం కేంద్ర ప్రభుత్వ జిఎస్‌టి ఇంటిలిజెన్స్‌ విభాగంవారు నమోదు చేసిన అంశాలే కదా! సిబిఐ కోర్టు మొదలు సుప్రీం కోర్టు వరకూ అవే వాదనలు కదా! వాస్తవాలలా ఉండగా ‘నా అరెస్టుకు కేంద్రం మద్దతు ఉందనడం సరికాదు’ అని చంద్రబాబు శనివారం నాడు ఢిల్లీలో చెప్పడం ఎవరిని మభ్య పుచ్చడానికి? లేదా సంతృప్తి పరచడానికి? ఇంతలా ఆత్మవంచనకు పాల్పడవలసిన అవసరం ఏమొచ్చింది ?
విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావలసిన విశాఖ రైల్వే జోన్‌, ప్రత్యేక ఉన్నత విద్యా వైద్య సంస్థలు, పెట్రో కెమికల్‌ కారిడార్‌, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజి వంటి అనేక అంశాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. రాష్ట్రాల హక్కులను హరిస్తున్న కేంద్రం రాజ్యాంగ ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోంది. అయినా… ఎన్‌డిఎ తోనే ఎందుకు వెళ్లాలి? ఈ రాష్ట్రానికి, తెలుగువారికీ ఒరిగేదేమిటన్నది టిడిపి, జనసేన నేతలు ప్రజలకు వివరించాలి మరి!

  • గిరిపుత్ర
➡️