దూరదర్శన్‌ శాంతిస్వరూప్‌ కన్నుమూత

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌గా తెలుగు ప్రజలకు సుపరిచితమైన శాంతి స్వరూప్‌ (74) శుక్రవారం కన్నుమూశారు. రెండు రోజుల క్రితం గుండె సంబంధ సమస్యతో సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. శాంతిస్వరూప్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 1983 నవంబర్‌ 14న తొలిసారిగా దూరదర్శన్‌లో తెలుగులో వార్తలు చదివారు. పదేళ్ల వరకు టెలీప్రాంప్టర్‌ లేకుండా పేపర్‌ చూసి చెప్పేవారు. 2011లో పదవీ విరమణ చేసేవరకూ ఆయన దూరదర్శన్‌లో పలు విభాగాల్లో సేవలందించారు. విలక్షణమైన శైలి, స్పష్టమైన ఉచ్ఛారణతో అత్యుత్తమ న్యూస్‌ రీడర్‌గా ఆయన ప్రత్యేకత చాటుకున్నారు. శాంతిస్వరూప్‌ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సిఎంలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రేవంత్‌ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం ప్రకటించారు. ఆయన అందించిన సేవలు తెలుగు మీడియా రంగంలో చిరస్మరణీయమని పేర్కొన్నారు.

 

➡️