మా పొట్టకొట్టే చర్యలు చేపట్టద్దు

మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతం... గురువారం తెల్లవారుజాము నుంచే ఏలూరు పంపులు చెరువు వద్ద ఉన్న వెహికల్ డిపో వద్ద బైఠాయించిన కార్మికులు... చెత్త వాహనాలు బయటకు రాకుండా అడ్డుకున్న కార్మికులు.

– పోటీ కార్మికులను అడ్డుకున్న మున్సిపల్‌ కార్మికులు

– సూళ్లూరుపేటలో ఐదుగురిపై బైండోవర్‌ కేసులు

ప్రజాశక్తి- యంత్రాంగం :సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్న మున్సిపల్‌ కార్మికులపై ప్రభుత్వం, అధికారులు బెదిరింపులకు దిగుతున్నారు. పోటీ కార్మికులతో పనులు చేయిస్తూ… వారిని అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పలు జిల్లాల్లో పోలీసుల సహకారంతో పోటీ కార్మికులతో పనులు చేయిస్తున్నారు. అడ్డుకుంటున్న కార్మికులపై బలవంతపు అరెస్టులకు పాల్పడుతున్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఐదుగురిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. విశాఖలో 30 మందిని అరెస్టు చేశారు. విజయవాడలో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. మహిళా కార్మికురాలని ఆటోతో ఢ కొట్టించారు. పోటీ కార్మికులతో పనిచేయిస్తూ మా పొట్ట కొట్టే చర్యలు చేపట్టద్దని ప్రభుత్వాన్నికి విన్నవించారు. రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు చేపట్టిన సమ్మె గురువారంతో పదవరోజుకు చేరుకుంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట బజారువీధిలో పేరుకుపోయిన చెత్తను ఎంపిపి సభ్యులు అల్లూరు అనీల్‌రెడ్డి, కమిషనర్‌ నరేంద్రకుమార్‌ ఆధ్వర్యంలో వైస్‌ చైర్మన్‌ చిన్ని సత్యనారాయణ, కౌన్సిలర్లు కలిసి పోలీసు బలగాలతో తొలగించే కార్యక్రమం చేపట్టారు. ‘మా సమస్యలు పరిష్కరించకుండా, మా పొట్ట కొట్టే చర్యలు చేపట్టద్దు’ అంటూ వారిని మున్సిపల్‌ కార్మికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులు, వైసిపి ప్రజా ప్రతినిధులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సిఐటియు కార్యదర్శి కె.లక్ష్మయ్య, ఇద్దరు నాయకులు, ఇద్దరు మున్సిపల్‌ నాయకులను బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. వీరిపై బైండోవర్‌ కేసు నమోదు చేసి అనంతరం విడిచి పెట్టారు. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం వద్ద చెత్త తరలించడానికి అధికారులు చేసిన ప్రయత్నాన్ని మున్సిపల్‌ కార్మికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బోనా అనిత, పులమరశెట్టి పైడమ్మ, చిట్టిబోయిన రమణ, బేసబోయిన హేమలత, ఎల్లమ్మ సహా 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విడిచిపెట్టారు. జివిఎంసి ఏడో వార్డు కారుషెడ్‌ కూడలి వద్ద మనస్తాపానికి గురైన కార్మికుడు యజ్జల చిన్నా పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తోటికార్మికులు స్పందించి సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విజయవాడ రాణిగారితోట 18వ డివిజన్‌లో క్లాప్‌ ఆటో డ్రైవర్‌ అత్యుత్సాహం ప్రదర్శించి పారిశుధ్య కార్మికురాలు మరియమ్మను ఆటోతో ఢ కొట్టాడు. దీంతో ఆమెకు గాయలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.విజయనగరంలో ఎఐటియుసి అనుబంధ సంఘం కార్మికులు కూడా సమ్మెలోకి రావడంతో నగరంలో పూర్తి స్థాయిలో పారిశుధ్య సేవలు నిలిచిపోయాయి. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.జగన్‌మోహన్‌ మద్దతు తెలిపారు. పార్వతీపురంలో డప్పు వాయిద్యాలతో, పాలకొండలో చేతికి సంకెళ్లు వేసుకొని నిరసన తెలిపారు. అనంతపురం కార్పొరేషన్‌ పాతూరు మొదటి రోడ్డులో అధికారులు జెసిబి ద్వారా చెత్త తరలింపుకు ప్రయత్నించగా మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు అడ్డుకున్నారు. శ్రీ సత్యసాయి, ఉమ్మడి కర్నూలులో నిరసన దీక్షలు కొనసాగాయి. కడపలో ప్రభుత్వ శవయాత్రతో నిరసన తెలిపారు. ఒంగోలులో పొర్లుదండాలు పెట్టి నిరసన తెలిపారు. బాపట్ల జిల్లా చీరాలలో భిక్షాటన చేశారు.గుంటూరు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి జిన్నా టవర్‌ సెంటర్‌ వరకూ ప్రదర్శన నిర్వహించారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోటీ కార్మికులను అడ్డుకోవడంతో మున్సిపల్‌ కార్మికులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం విడుదల చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పనిముట్లతో కార్మికులు నిరసన తెలిపారు. తాడేపల్లిగూడెంలో పోటీ కార్మికులను పెట్టి పనులు నిర్వహిస్తున్న మున్సిపల్‌ అధికారులను మున్సిపల్‌ కార్మికులు నిలదీశారు. ఏలూరులో వెహికల్‌ డిపో వద్ద చెత్తసేకరణ వాహనాలు బయటకు రాకుండా కార్మికులు అడ్డుకున్నారు. కోనసీమ, తూర్పుగోదావరి,కాకినాడ జిల్లాల్లో మున్సిపల్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరాలను కొనసాగించారు. నెల్లూరులో జలకన్య విగ్రహం నుంచి పప్పుల వీధి మీదుగా ఎబిఎం కాంపౌండ్‌ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మెయిన్‌ రోడ్డులో మానవహారం చేపట్టారు. పలాసలో అర్ధనగ ప్రదర్శన, ఇచ్ఛాపురంలో రాస్తారోకో నిర్వహించారు.

 

municipal workers strike 10th day konaseema

  • పారిశుధ్య కార్మికులు బిక్షాటన

డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ – మండపేట : వారి సమస్యలు పరిష్కారం కోరుతూ పారిశుద్ధ కార్మికుల బిక్షాటన కార్యక్రమం చేపట్టారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సమస్యల పరిష్కారం కోరుతూ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారానికి నాటికి 10వ రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా పలువురు కార్మిక నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వంతో కార్మిక సంఘ నాయకులు డిమాండ్ల పరిష్కారానికి పలుమార్లు చర్చలు జరిపినా అవి విఫలమయ్యాయన్నారు. నిత్యం పట్టణ ప్రజల ఆరోగ్య కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి పట్టణ పరిశుభ్రత కోసం పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం వెనకడుగు వేయడం సరికాదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు ప్రభుత్వం పెంచాలన్నారు. కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని, సిఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్ ఈ ఎస్ ఐ, పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు కొమరపు నరేంద్ర కుమార్, బంగారు కొండ, లోవరాజు, విజయ్, సవరపు సరోజినీ, బంగారు అన్నవరం, మల్లవరపు సువార్త, మడికి హేమలత, సిహెచ్ వెంకటలక్ష్మి, భాను,
సన్యాసమ్మ తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు జిల్లాలో మున్సిపల్ కార్మికుల భారీ ర్యాలీ

 

municipal workers strike 10th day gnt

గుంటూరు జిల్లా నరసరావుపేటలో మునిసిపల్ కార్మికుల నిరవధిక సమ్మె

municipal workers strike 10th day vsp

విశాఖ : మున్సిపల్ కార్మికులపై లాఠీచార్జిక్ వ్యతిరేకంగా కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టాచ్ దగ్గర ధర్నా చేస్తున్న కెవిపిఎస్ నాయకులు ఎం సుబ్బారావు, సుబ్బన్న, కుమారి, వై రాజు పాల్గొన్నారు.  

 

 

municipal workers strike 10th day visakha

  • అంగన్వాడీ, మున్సిపల్ కార్మికుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ ముఠా కార్మిక సంఘం నిరసన

విశాఖ : అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ సిఐటియు జగదాంబ జోన్ ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు (4-1-24) టౌన్ కొత్త రోడ్ మరియు స్ప్రింగ్ రోడ్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఠా కార్మిక సంఘం నాయకులు ఎం సుబ్బారావు  మాట్లాడుతూ అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలనీ ప్రజాస్వామ్యతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే ఆడవారని కూడా చూడకుండా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు అతి దుర్మార్గంగా అంగన్వాడీలను, మున్సిపల్ కార్మికులను కొట్టి అరెస్టులు చేశారని ఇది మానవతకే చెరగని మచ్చ అని తెలియజేశారు. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అంగన్వాడీల జీతాలు పెంచుతానని, మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని ఇచ్చిన హామీలను నెరవేరుస్తాడనే నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా అడిగిన పాపానికి అక్రమంగా అరెస్టులు చేయిస్తున్నారని ఈ పరిణామాలను యావత్ ప్రజానీకం గమనిస్తున్నారని 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గోరీ కడతారని హెచ్చరించారు. డివైఎఫ్ఐ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ మాట్లాడుతూ మెగా డీఎస్సీ ప్రకటిస్తానని ఇచ్చిన హామీని అమలు చేయమని అడిగినందుకు డివైఎఫ్ఐ నాయకులను నిరుద్యోగులను విజయవాడలో అక్రమ అరెస్టులు చేశారని అంగన్వాడి మున్సిపల్ కార్మికులు చేసే పోరాటానికి ఎల్లవేళల తమ మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఠా కార్మికులు డిమాండ్లతో కూడిన ప్ల కార్డులను ప్రదర్శించారు.

 

municipal workers strike 10th day prakasam

 

municipal workers strike 10th day prakasam d

ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో జరుగుతున్న నిరువదిక సమ్మె గురువారం 10 రోజుకు చేరింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న నిరంకుశ వైఖరిని నిరసిస్తూ మున్సిపల్ కార్మికులు రోడ్డుపై పడుకొని పొర్లు దండాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు.

 

municipal workers strike 10th day ongole

ఒంగోలులో మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతున్న టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్

ప్రకాశం జిల్లాలో పదో రోజు కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె

municipal workers strike 10th day eluru

ఏలూరు : మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతం… గురువారం తెల్లవారుజాము నుంచే ఏలూరు పంపులు చెరువు వద్ద ఉన్న వెహికల్ డిపో వద్ద బైఠాయించిన కార్మికులు… చెత్త వాహనాలు బయటకు రాకుండా అడ్డుకున్న కార్మికులు.

➡️