రోజురోజుకూ పెరుగుతున్న గృహహింస

Mar 3,2024 11:36 #Domestic Violence, #Sneha

..మోటూరు ఉదయం కుటుంబ న్యాయసలహా కేంద్రంలో నడుస్తున్న ‘ఐద్వా అదాలత్‌’కు ఇటీవల వచ్చిన ఇరవై ఐదు కేసులను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. గృహ హింస ఎంతగా పెరిగిపోతున్నదీ అర్థమవుతోంది. ఓవైపు పురుషాధిక్యత.. మరోవైపు తాగుడు.. తదితర వ్యసనాలతో తల్లడిల్లుతున్న కుటుంబాలు అనేకం. ఇంటర్నెట్‌, మొబైల్‌ వాడకంతో పెరిగిన సైబర్‌ నేరాలు.. ఆర్థిక అసమానతలు దండలో దారంలా ఉన్నాయనేది వాస్తవం. అలాగే కొన్ని కేసుల్లో రాజకీయ పార్టీల నిర్బంధాలతో కాపురాలు కూలిపోతున్నాయి. అత్యాచారాలు, అక్రమ సంబంధాలు పెరిగాయి. బాధ్యతలేని భర్తలతో అనేక కుటుంబాలు కునారిల్లుతున్నాయి.

వయస్సుతో సంబంధం లేదు. కొత్తగా పెళ్లయిన వాళ్ళలో, మధ్య వయస్కుల్లో కూడా సమస్యలు వస్తూనే ఉన్నాయి. భర్తలు వారి అలవాట్లు మార్చుకోకపోతే స్త్రీలు విడిపోయి, పిల్లలతో స్వయంగా జీవించడానికి సిద్ధపడుతున్నారు. పురుషాధిక్య భావజాలం పెరుగుతోంది. ఒకరకంగా కుటుంబసభ్యులే డబ్బుకోసం వారు విడిపోయేలా, చనిపోయేంతగా స్త్రీలపై ఒత్తిడి చేస్తున్నారు.

అడ్డూ అదుపూ లేని హింస..

అదాలత్‌కు వచ్చే కేసుల్లో దాదాపు సగం గృహహింసకు సంబంధించిన కేసులే. ఆమె డిగ్రీ చదివి, ఉద్యోగ ప్రయత్నం చేస్తుంది. క్రీడారంగంలో ప్రావీణ్యం ఉంది. భర్త పెట్టే హింస భరించలేక పుట్టింటికి వచ్చేసింది. ఐద్వాను ఆశ్రయించింది. అతనిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. విడాకుల కోసం కోర్టుకు వెళ్ళింది. మరో కేసులో అతనికి అనుమానం.. అతను పెట్టే హింసకు ఆమెకు ప్రాణానికే ముప్పని, పుట్టింటికి వచ్చింది. ఇంకో కేసులో ఆమెకు పెళ్లయ్యి మూడేళ్లు. తొమ్మిదినెలల బాబు. ఆమె వయస్సు ఇరవై ఏళ్లు. భర్త, అత్తా కలిసి తలుపులు వేసి మరీ ఆమెను కొడుతున్నారు. ఇంట్లో పెట్టి తాళం వేస్తున్నారు. అతను అత్తమామలను కూడా కొట్టాడు. ఈ వేధింపులు భరించలేక ఐద్వాను ఆశ్రయించింది. ఆమె ముస్లిం యువతి. భర్త తాగొచ్చి ఆమెను తన భార్యే కాదంటాడు. అర్ధరాత్రి కొట్టి, తిట్టి రోడ్డు మీదకు లాగుతాడు. ఆమె ఐద్వాకు వచ్చింది. అతన్ని రమ్మంటే రాననేశాడు. అతనిపై కేసు నమోదు చేయించారు. ఇంకో కేసులో ఆమె ప్రైవేట్‌ స్కూలు టీచరు. ఇద్దరు అమ్మాయిలు. భర్త వ్యసనపరుడు. ఆమెను దారుణంగా కొడతాడు, తిడతాడు. పుట్టింటి నుంచి డబ్బు తీసుకురమ్మని వేధిస్తుంటాడు. ఆమె విపరీతమైన దెబ్బలతోనే ఐద్వా కుటుంబ న్యాయసలహా కేంద్రానికి వచ్చింది. ఆమె భర్తకు ఐద్వా వారు ఫోన్‌చేసి, హెచ్చరిం చారు. అతన్ని న్యాయసలహా కేంద్రానికి పిలిచి కౌన్సెలింగ్‌ చేశారు. ప్రస్తుతం బాగానే ఉన్నారు. ఇవన్నీ పరిశీలిస్తుంటే కుటుంబా లలో హింస ఎంతగా పెరిగిపోతుందో అర్థమవుతోంది. ఉన్న చట్టాలు అమలు జరిగితేనే వీటిని అరికట్టగలం.

అత్యాచారాల పరంపర..

మహిళలకు పని ప్రదేశాల్లో ఎలాంటి భద్రతా లేకుండా పోయింది. అలాంటి కేసే ఇది. మధ్య వయసు దాటిన ఇద్దరు పిల్లల తల్లి. ఆమెకు తెలియకుండా ప్రసాదంలో, మరో రూపంలో మత్తుమందిస్తూ అదే ఆఫీసులో పనిచేసే వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఐద్వాను ఆశ్రయించింది. ఆ వ్యక్తిని అక్కడ నుంచి బదిలీ చేయించి, ఆమె సమస్య పరిష్క రించడం జరిగింది.

సైబర్‌ నేరాలు..

ఇంటర్నెట్‌ పెరిగాక సైబర్‌ నేరాలూ పెరిగాయి. సాంకేతికతను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ కేసులో మైనర్‌ బాలికలను ఏకాంతంగా ఉన్నప్పుడు ఫోటోలు తీసి, తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్‌కి పంపి, ఆ ఫొటోలతో వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వేధిస్తున్నాడు. అలా వేధించబడుతున్న ఒక బాలిక ఐద్వా న్యాయసలహా కేంద్రానికి వచ్చింది. ఆమెతో కేసు నమోదు చేయించి, అందరి ఫొటోలూ డిలీట్‌ చేయించారు. అతనిపై కేసు నమోదు చేసి, శిక్ష పడేలా చేశారు.

సహజీవనం..

ఇటీవల డేటింగ్‌లు, సహజీవనం అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. సరైన చట్టాలు, ఉన్నా వాటి పట్ల అవగాహన లేకపోవడంవల్ల మహిళలు అనేకమంది మోసపోతున్నారు. ఈ కేసులో సహజీవనం చేస్తున్న అతన్ని పెళ్లి చేసుకోమని ఆమె అడిగింది. అతని తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఆమె ఐద్వాని ఆశ్రయించగా ఆమెతో కేసు ఫైల్‌ చేయించారు. గత్యంతరం లేక పెళ్లికి అంగీకరించినప్పటికీ ఆమె తిరస్కరించింది.

తాగుడు, వ్యసనాలు..

ప్రభుత్వాలు మద్యంతోనే ఆదాయం సంపాదిస్తూ.. పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తోన్నాయి. ఈ కేసులో అబ్బాయికి తాగుడు, ఇతర వ్యసనాలున్నాయి. దీంతో భార్య అతనికి దూరంగా జీవిస్తోంది. భార్య కావాలని అతను ఐద్వాను ఆశయ్రించాడు. ఆమెను సంప్రదించగా, మాన్పించడానికి ఎన్నోవిధాల ప్రయత్నించినట్లు వివరించి, విడాకుల కోసం కోర్టుకెళ్లింది. మరోకేసులో అతని తాగుడు, హింస భరించలేక ఆమె ఐద్వాకి వచ్చింది. అతడికి నచ్చజెప్పి, కిరణాకొట్టు పెట్టించి, ఆమె పుట్టింటికి దగ్గరలో కాపురం ఉండేలా చేశారు.

రాజకీయ పార్టీల నిర్బంధాలు..

భర్త, అత్తమామల వేధింపులే కాకుండా మహిళలకు రాజకీయనేతలతోనూ వేధింపులు తప్పడం లేదు. ఈ కేసులో ఓ యువతి ఐద్వాని కలిసింది. భర్త మేనత్త కొడుకే. అక్రమ సంబంధంతో భార్యకు భర్త దూరంగా ఉంటున్నాడు. ఒక్కతే ఉంటున్న ఆమెను గమనించిన ఓ రాజకీయపార్టీ నాయకుడు ఆమెను వేధిస్తున్నాడు. భర్తకి పెద్దలు నచ్చజెప్పారు. అయితే ఆమెను కలవకుండా సదరు రాజకీయనేత అడ్డుకుంటున్నాడు. ఐద్వా ఆ రాజకీయనేతపై కేసు పెట్టించి, ఆమె భర్తకు నచ్చజెప్పి, వేరేచోట కాపురం పెట్టించారు.

అక్రమ సంబంధాలు

ఇటీవల కాలంలో అక్రమసంబంధాలు పెరిగిపోయాయి. ఆమె ఇలా ఎంతకాలం? పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. దాంతో అతను రావడం మానేశాడు. ఆమె ఐద్వాను ఆశ్రయించింది. ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చి, వివాహం చేశారు. ఇంకో కేసులో భార్య ఉండగానే వంటమనిషితో అక్రమసంబంధం. ఆమె, ఆమె తరపువారూ గొడవ చేసేటప్పటికి తాళికట్టాడు. మూడేళ్లు చూసి ఆమె తల్లిదండ్రులు ఐద్వాను ఆశ్రయించారు. అతన్ని మహిళా కమిషన్‌ వద్ద పెట్టి, ఇరుపక్షాల అంగీకారం మేరకు ఆమెకు పరిహారం ఇప్పించారు.

పెత్తనం.. బాధ్యత లేమి..

భర్త వేధింపులు భరించలేక, ఇంటి బాధ్యతలు పట్టనివారు ఎందరో. చివరకు వాళ్లకి భయపడి ఆగిపోయారు. ఈ రెండు కేసులు అలాంటివే. వాళ్లు తమ సమస్యలపై ఐద్వా వరకూ వచ్చారు. కానీ భర్తకి భయపడి తిరిగి రాలేదు. మరోకేసులో వారికి ముగ్గురు ఆడపిల్లలు. తండ్రి పిల్లల పెళ్లి చేయకపోగా, వారికొచ్చిన సంబంధాలు చెడగొడుతున్నాడు. ఇంటిని పట్టించుకోకపోతే, పిల్లలే నడిపిస్తున్నారు. ఆమె ఐద్వాలో ఫిర్యాదు చేసింది. తన పద్ధతి మార్చుకోవడానికి సిద్ధపడని అతనిపై పిల్లల సహకారంతో ఆమె కోర్టును ఆశ్రయించి, విడాకులు తీసుకున్నారు.

వరకట్న వేధింపులు..

ఇద్దరూ విద్యావంతులే. ఇద్దరు పిల్లలు. ఆమెకు పుట్టింటి వారిచ్చిన ఆస్తి అమ్మి ఇవ్వమంటాడు. కోవిడ్‌ సమయంలో ఆమెను పుట్టింట్లో దింపి, తర్వాత రానీయలేదు. ఆమె ఐద్వాను ఆశ్రయించింది. ప్రస్తుతం కౌన్సిలింగ్‌ జరుగుతోంది.

ఒంటరితనం..ఒంటరి మహిళలు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఈ కేసులో భర్త మరణించాడు. పిల్లలు లేరు. ఒక పాపను భర్త ఉండగానే దత్తత తీసుకున్నారు. ఆమె భర్త ఆస్తిలో వాటా కోసం ఐద్వాను ఆశ్రయించింది. అత్తామామలతో మాట్లాడి, ఆస్తిలో కొంతభాగం ఆ పాపకు రాయించారు.మరో కేసులో ఆమె భర్త ఎయిడ్స్‌తో మరణించాడు. ఆమెకు భర్త వల్ల హెచ్‌ఐవి పాజిటివ్‌. అత్తింటివైపు ఆమెకు ఎలాంటి ఆస్తీ ఇవ్వలేదు. పుట్టింటివైపు నుంచి ఆదరణ లేదు. ఇరువైపుల వారెవరూ స్పందించలేదు. ఐద్వా వారే ఆమెను హోమ్‌లో చేర్పించారు.

భర్తలు సైతం..

ఐద్వాకు భార్యలే కాదు. భర్తలూ వస్తుంటారు. ఆమె పుట్టింటికి వెళ్లి, రావడం లేదు. పిల్లల్నీ పంపడం లేదు. దీంతో భర్త ఐద్వాను ఆశ్రయించాడు. మరో కేసులో కోవిడ్‌ వల్ల భర్త ఆదాయం తగ్గింది. ఆమె తండ్రి వద్దకు వెళ్లిపోయింది. అతడు ఐద్వాను ఆశ్రయించాడు.కానీ వారిని పిలిపించి మాట్లాడితే, వీళ్ల బాధ్యతారాహిత్యం, వ్యసనాలు తెలిశాయి. కౌన్సిలింగ్‌ చేసి, పంపారు.

ఆమెను చంపేశారు..

ఒక యువజంట. వారికో బాబు. ఆమె కుటుంబీకులు కుమార్తెను తమ దగ్గరే ఉంచుకుని, భర్త ఆస్తిలో వాటా కావాలని కేసు వేయించారు. గృహహింస కింద పోలీస్‌స్టేషన్‌లో కేస్‌ పెట్టారు. పది లక్షలు ఇస్తే, పిల్లవాడిని పంపుతామని చెప్పారు. ఐద్వా సహకారంతో ఎనిమిది లక్షలిస్తానని అతను ఒప్పందం చేసుకున్నాడు. ఆమె పుట్టింటివారు ఇరవై లక్షలు ఇస్తే కానీ వదలనని ఆమెపై ఒత్తిడి చేశారు. ఆమె ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.

నవ్యసింధు

➡️