ప్రాణాంతకమైన కుక్కల దాడులు

Dec 14,2023 09:57 #Dog Bite, #Social Activists
dog bit is serious issue

దేశవ్యాప్తంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్న తీరు
అధికార యంత్రాంగాలు దీనిని నియంత్రించాలి
సామాజికవేత్తల పిలుపు

న్యూఢిల్లీ : భారత్‌లో వీధి కుక్కల దాడులు తీవ్రమవుతున్నాయి. ఇలాంటి సంఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నది. ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాల పర్యవేక్షణ కరువవటంతో వీధి కుక్కలు చెలరేగిపోతున్నాయి. దీంతో వీధి కుక్కల దాడులపై హెచ్చరికలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాలు, సంబంధిత అధికార యంత్రాంగాలు ఈ విషయంలో వెంటనే దృష్టి సారించి, దాడులను నియంత్రించాలని సామాజికవేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు.వీధి కుక్కల దాడుల్లో ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు బాధితులుగా మిగులుతున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నమోదైన ఘటనలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ప్రమాదాలకు సంబంధించిన వైరల్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో చర్చలను ప్రేరేపిస్తాయని కుక్కల ప్రవర్తనను అధ్యయనం చేసే కోల్‌కతాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ పరిశోధకురాలు అనిందిత భద్ర అన్నారు. ప్రజలు ఇప్పుడు ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారని తెలిపారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూహెచ్‌ఓ) సమాచారం ప్రకారం.. ప్రతి సంవత్సరం భారతదేశంలో లక్షల సంఖ్యలో వీధి కుక్కల దాడులు జరుగుతున్నాయి. ఇది రేబిస్‌తో పదివేల వార్షిక మరణాలకు దారి తీస్తున్నది. కుటుంబ, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది 25 లక్షల కుక్కకాటు కేసులను నమోదు చేసింది. మార్స్‌ పెట్‌కేర్‌ డేటా ప్రకారం భారత్‌లో దాదాపు 6.5 కోట్ల వీధికుక్కలు ఉన్నాయి. ఈ సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం కావటం గమనార్హం. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాలను ఒత్తిడి చేసేందుకు భారత పౌరులు తమ రాష్ట్రాల్లో కోర్టులను ఆశ్రయించారు. అందుకు అనుగుణంగానే న్యాయస్థానాలు ప్రభుత్వాలకు, స్థానిక యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేశాయి. కుక్క కాటుతో గాయపడిన వారికి నష్టపరిహారం అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నదని పంజాబ్‌ మరియు హర్యానా హైకోర్టు తీర్పు చెప్పింది. అధికారులు బాధితులకు కుక్కకాటు గాయానికి కనీసం రూ.10,000 చెల్లించాలనీ, చర్మంపై మాంసం తీసి ఉంటే కనీసం రూ.20,000గా నిర్ణయించింది. గాయాలను పరిశీలించి చెల్లింపులను నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా తీర్పునిచ్చింది. 2021 అధ్యయనం ప్రకారం.. కుక్కల సంఖ్య వేగంగా పెరుగుతున్న పట్టణ ప్రాంతాలు నివాస ప్రాంతాలు. ఇవి చెత్త కుప్పలతో సహా స్థిరమైన ఆహార వనరులను అందిస్తాయి. చాలా మంది భారతీయులు కూడా జాలితో జంతువులకు ఆహారం ఇస్తారు. అయితే, అధికార యంత్రాంగాలతో పాటు కుక్కలను పెంచే, పెంచుకునే యజమానులు సైతం బాధ్యతగా వ్యవహరించి ఈ ప్రమాదాలకు ముగింపు పలకాలని సామాజికవేత్తలు, పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.

➡️