మోడీకి శ్రీలంకను ఖండించే దమ్ముందా ? : తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌

ప్రజాశక్తి- వెల్లూరు : శ్రీలంకను ఖండించే దమ్ము ప్రధాని మోడీకి ఉందా? కచ్చతీవు దీవుల గురించి అక్కడికి వెళ్లి మాట్లాడగలరా ? అని డిఎంకె నేత , తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ ప్రశ్నించారు. మంగళవారం నాడిక్కడ జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు భారత ప్రభుత్వం శ్రీలంకకు కచ్చఠీవి ఇవ్వడంపై బిజెపి మాట్లాడటం ప్రారంభించింది. కానీ , ఇది వారికి వ్యతిరేకంగా మారింది. ఇప్పుడు కందిరీగ తుట్టెలో చేయిపెట్టిన బిజెపి అందులో ఇరుక్కుపోయి గిజగిజలాడుతోందన్నారు..2014 లో అధికారంలోకి వచ్చిన బిజెపి సుప్రీంకోర్టులో ఏం చెప్పింది ? ” మేము ద్వీపాన్ని తిరిగి పొందాలనుకుంటే, మేము శ్రీలంక ప్రభుత్వంతో యుద్ధం చేయవలసి ఉంటుంది ” అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ దశాబ్దంలో ప్రధాని మోదీ శ్రీలంకను ఎన్నిసార్లు సందర్శించారు ? కనీసం ఒక్కసారైనా కచ్చతీవు గురించి మాట్లాడారా?శ్రీలంక అధ్యక్షుడిని కలిసినప్పుడల్లా కచ్చతీవు భారత్‌కే చెందుతుందని చెప్పారా ? ఆ సమయంలో మోడీకి కచ్చతీవు గుర్తుకు రాలేదు. నెహ్రూ హయాంలో – ఇందిరా కాలంలో జరిగినవన్నీ గుర్తున్న మోడీకి రెండేళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తుకు రావడం లేదా? అని ప్రశ్నించారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కొందరు ‘ పార్ట్‌ టైమ్‌ ‘ రాజకీయ నాయకులు తమిళనాడుకు వస్తున్నారు. ‘నేనెవరో మీకు తెలుసు. ప్రధాని మోడీ ఎలాంటి వారో మీకు తెలుసు. ఎన్నికల సీజన్‌లో మాత్రం రాష్ట్రంలో పర్యటనలు జరుపుతారు. అబద్ధాలు , దూషణలు, విద్వేషాలను ప్రసంగం నిండా దట్టిస్తారు. రాష్ట్రంలో వరదలొస్తే ఇటువైపు తొంగిచూడరు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులు అడిగితే ఇవ్వరు. రాష్ట్ర ప్రజలను మోసం చేసినవారు ఇప్పుడు తమిళనాడును ఉద్ధరిస్తామంటూ ముందుకొస్తున్నారు. ఇటువంటి పార్ట్‌టైమ్‌ రాజకీయ నాయకులను ఉపేక్షించకండి’ అని ఓటర్లకు స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు.
ఇండియా బ్లాక్‌ కు మీరు ఇచ్చే ప్రతి ఓటు తమిళనాడును మరింత విజయవంతమైన మార్గంలో తీసుకెళ్తుంది . తమిళనాడును ద్వేషించే ప్రధాని మోడీకి బదులు , ఇండియా వేదిక తరపున ప్రధానమంత్రి కాబోతున్న వ్యక్తి తమిళనాడు అభివద్ధికి కచ్చితంగా సహకరిస్తారని ఆయన అన్నారు. తాము సాధించిన విజయాలు పదేళ్ల అన్నాడీఎంకే పాలనలోని చీకట్లను తొలగించి తమిళనాడులో వెలుగులు నింపాయని అన్నారు.
అన్నాడీఎంకె అధికారంలో ఉన్నప్పుడు పళనిస్వామి మైనారిటీ ప్రజలను వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు భాజపాతో బూటకపు పొత్తు పెట్టుకుని మైనార్టీలను పట్టించుకున్నట్లు నటించడం మొదలుపెట్టారు.
గత ఐదేళ్లలో అన్నాడిఎంకె ఎంపీలు ఏం చేశారు ? కేంద్రప్రభుత్వం ప్రజావ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు వాటికి మద్దతు పలికారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు వాటికి వ్యతిరేకంగా తాము పార్లమెంటు లోపలా , బయటా తామే పోరాడామని అన్నారు.

➡️