కెసిఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులిటెన్‌ : ప్రధాని ట్వీట్‌ – సిఎం ఆరా

తెలంగాణ : బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కెసిఆర్‌ ఎడమ కాలి తుంటి ఎముక మార్పిడి చేయాలని తెలిపారు.

వైద్యుల హెల్త్‌ బులిటెన్‌… ” బాత్‌రూమ్‌లో జారిపడటంతో కెసిఆర్‌ ఎడమ కాలి తుంటి ఎముక విరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఎడమ కాలి తుంటి ఎముక మార్పిడి చేయాలి. కెసిఆర్‌ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు ” అని హెల్త్‌ బులెటిన్‌లో వైద్యులు పేర్కొన్నారు.

కెసిఆర్‌ త్వరలో కోలుకోవాలి : మోడీ ట్వీట్‌

కెసిఆర్‌ ఆరోగ్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా స్పందించారు. కెసిఆర్‌కు గాయమైన విషయం తెలియగానే చాలా బాధకలిగిందని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. కెసిఆర్‌ మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. కెసిఆర్‌ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు.

సిఎం రేవంత్‌ రెడ్డి ఆరా…

కెసిఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై సిఎం రేవంత్‌రెడ్డి ఆరా తీస్తున్నారు. కెసిఆర్‌కు అందిస్తున్న వైద్యం గురించి హైదరాబాద్‌ సోమాజిగూడ యశోదా ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. కెసిఆర్‌కు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వికి సిఎం రేవంత్‌ సూచించారు. కెసిఆర్‌ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

➡️