విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు

విధి నిర్వహణలో నిర్లక్ష్యం

మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

  • పనిచేస్తున్న కేంద్రాన్ని విడిచి వెళ్లవద్దు ఫిర్యాదు వచ్చిన వెంటనే చర్యలు
  • కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదని, ఫిర్యాదు వచ్చిన వెంటనే 24 గంటల్లో దాని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌ స్పష్టం చేశారు. సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై ఆర్‌ఒలు, ఎఆర్‌ఒలు, నోడల్‌ అధికారులతో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి తహశీల్దార్లు, ఎన్నికల సిబ్బంది వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది ముందస్తు అనుమతులు లేకుండా వారు పనిచేస్తున్న కేంద్రాన్ని విడిచి వెళ్లరాదని స్పష్టం చేశారు. ఫిర్యాదు వచ్చిన 24 గంటల్లో పరిష్కారం చూపాలని ఆదేశించారు. నిబంధనలు మీరిన అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు. చెక్‌పోస్టుల్లో వెబ్‌కాస్టింగ్‌ పోలింగ్‌, కౌంటింగ్‌కి సంబంధించి నిర్దేశించిన ఏర్పాట్లు పూర్తిస్థాయిలో ఉన్నాయో లేదో ముందుగా చూసుకోవాలని సూచించారు. ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది వారికి అప్పగించిన బాధ్యతలను అప్రమత్తంగా నిర్వహించాలన్నారు. 48 గంటలు దాటినా కొన్ని శాఖలు రోజువారీ ఎన్నికల నివేదికలు అందజేయడం లేదన్నారు. 13వ తేదీలోగా పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రతిపాదనలు పంపాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఇంకా 18 రకాల స్టేషనరీ ఎన్నికల సంఘం నుంచి రావాల్సి ఉందని, వాటిని త్వరగా తెప్పించాలని సంబంధిత నోడల్‌ అధికారిని ఆదేశించారు. పోలింగ్‌ రోజున 450 వాహనాలు సిద్ధం చేయాలని, అవి కాకుండా అదనంగా 104 టాటా మ్యాజిక్‌ వాహనాలు సిద్ధం చేయాలని రవాణా నోడల్‌ అధికారికి సూచించారు. అన్ని చెక్‌పోస్టుల్లో వెబ్‌ కాస్టింగ్‌ కచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు.3 గంటల వరకే నామినేషన్ల స్వీకరణనామినేషన్ల స్వీకరణ సమయం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకేనని, మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలన్నారు. డిఎస్‌పి స్థాయి అధికారి బందోబస్తు నిర్వహించాలని చెప్పారు. పోలింగ్‌, ఆ ముందు రోజు చేయాల్సిన పనులను చెక్‌లిస్టు తయారు చేసుకుని విధులు నిర్వహించాలన్నారు. ప్రతి పిఒ తీసుకోవాల్సిన మెటీరియల్‌, ఇవిఎంల నిర్వహణ, ఓటరు జాబితా మార్క్‌ కాపీ, పిఒ, ఎపిఒ డైరీ, వారి విధులు, మాక్‌ పోల్‌, ఇవిఎం, వివి ప్యాట్లను ఎలా అనుసంధానం చేయాలి వంటి విషయాలు ఒకటికి రెండుసార్లు చూసుకోవాలని చెప్పారు. పోలింగ్‌ రోజున ప్రతి రెండు గంటలకు ఇచ్చే పోలింగ్‌ శాతం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంలో రాష్ట్రంలోనే ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎపిఎంఐపి పీడీ శ్రీనివాసరావును అభినందించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, రిటర్నింగ్‌ అధికారులు నూరుల్‌ కమర్‌, భరత్‌ నాయక్‌, సిహెచ్‌.రంగయ్య, లక్ష్మణమూర్తి, రామ్మోహన్‌, సుదర్శన్‌దొర, అప్పారావు, ఐసిడిఎస్‌ పీడీ బి.శాంతిశ్రీ, సిపిఒ ప్రసన్నలక్ష్మి, ఎల్‌డిఎం సూర్యకిరణ్‌, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె.చెన్నకేశవరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

➡️