అందరూ బాగుండాలనే ఆచరణే దీపావళి

Nov 12,2023 08:14 #Diwali, #Festivals, #Jeevana Stories
diwali

జీవితమంటేనే చీకటి వెలుగుల సమాహారం. దీపావళి నేర్పిన పాఠం అదే. తిమిర అంధకారాలను పారద్రోలే దీపకాంతుల వలె ప్రతి మనిషి జీవన ప్రయాణం అజ్ఞానాన్ని పారద్రోలే చైతన్యకాంతుల దిశగా సాగిపోవాలి. ఆత్మీయతలు, అనుబంధాల వేడుకగా అజ్ఞానం నశించి జ్ఞానకాంతులు వెదజల్లేదిగా ఈ దీపావళి నిలిచిపోవాలి.

ఒకప్పటి దీపావళి వెలుగులు ఎన్నో ఆనందాల లోగిళ్లకు ఆనవాలు. బంధాలు, అనుబంధాలకు పట్టుకొమ్మలు. పండుగలెన్ని ఉన్నా దీపావళి పండుగను ఎంతో ప్రత్యేకంగా చేసుకునేవారు. కానీ రానురాను పండగ రూపం మారింది. ఆత్మీయతల స్థానంలో ఆడంబరాలు వచ్చాయి. మట్టి ప్రమిదలు పోయి విద్యుత్‌ దీపాలు వెలుగుతున్నాయి. కాకరపువ్వొత్తులు, తాటాకు బాంబులు, మతాబులు, హావ్వాయి జువ్వాయిలు వంటివి పోయి చెవులు దద్దరిల్లే టపాసులు తయారయ్యాయి. ఆకాశంలో నక్షత్రాల మాదిరి కాంతులు వెదజల్లే తారజువ్వల స్థానంలో కళ్లు మిరుమిట్లు గొలిపే భీకర శబ్దం చేసే టపాసులు నింగినంటుతున్నాయి. కాలుష్య కారకాలతో ప్రకృతి నాశనానికి మనిషి ఎప్పుడూ ఒకడుగు ముందే ఉంటున్నాడు. వాయుకాలుష్యం, జలకాలుష్యం పేరుతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నాడు.
చీకటి చుట్టుముట్టినప్పుడు చేసే చిన్న ప్రయత్నం మనల్ని విజయమనే వెలుగు వైపు అడుగులు వేయిస్తుంది. జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఒక ముందడుగు వేయాలన్నా ఈ ప్రయత్నమే మనకు ఓ పెద్ద పాఠం. ఎప్పుడు ఎలాంటి విపత్తు విరుచుకుపడినా ఇలాంటి ప్రయత్నం ఒకటి చేయాల్సి ఉంటుంది. చీకటి శాశ్వతం కాదు; వెలుగు నిత్యం కాదు. ఒకదాని వెంట ఒకటి వస్తాయి. పోతాయి. వచ్చిన దానిని వచ్చినట్టు ఒప్పుకోవడం అలవర్చుకోవాలి. తట్టుకొని నిలబడాలి. ఇదే దీపావళి ఇచ్చే విలువైన సందేశం.
ప్రకృతి మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. మనుగడ పాఠం మొదలయ్యేది అక్కడి నుంచే. చెట్టును, పుట్టను, నింగిని, నేలను, నీటిని ఆరాధించడం మొదలుపెట్టిన మనిషి క్రమంగా వాటిని నాశనం చేసే వైపు అడుగులు వేస్తున్నాడు. పర్యావరణ హితులు ఎంత మొత్తుకున్నా పండుగల నాడు చేసే కాలుష్యానికి అదుపు ఉండడం లేదు. పండుగైనా, పర్వదినమైనా, జాతరైనా, ఉత్సవమైనా నాటి సంస్కృతి, సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. పండుగ పరమార్థం ఆవిరైపోతోంది.
ఏ పండుగైనా మతానికి సంబంధించిన వ్యవహారం కాదు. అనేక మనుషుల, ప్రదేశాల, సంస్కృతుల సమ్మేళనమే పండుగలు. దేశవిదేశాల్లో సైతం భారతీయ పండుగలు జరుపుకోవడం అందుకు పెద్ద ఉదాహరణ. ఫలాన మతం వారు ఫలానా పండుగే చేసుకోవాలి. ఫలానా పండుగ చేసుకునేవారు ఫలాన మతం వారు అన్న ముద్ర లేకుండా ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కడున్నా ఆయా దేశాల సమూహాలతో కలసి పండుగలు నిర్వహించుకోవడం వసుదైక కుటుంబానికి గొప్ప చిహ్నం. కానీ ఆ స్పృహ లేకుండా వ్యవహరించడం కొంతమంది అజ్ఞానానికి పరాకాష్టగా మారుతోంది. మతాల పేరుతో చిచ్చుపెట్టడం పండుగ స్ఫూర్తిని దెబ్బతీస్తోంది.
ఈ మూడేళ్ల కాలం మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. కరోనా ఉపద్రవంతో ప్రతిఒక్కరికి ఆరోగ్యస్పృహ, పర్యావరణ రక్షణపై అవగాహన వచ్చింది. పొదుపు పాఠాలు అలవర్చుకుంటున్నారు. బిడ్డల చదువు, భవిష్యత్తుతో పాటు కుటుంబ ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారు. ఆహారపు అలవాట్లు మార్చుకుంటున్నారు. కరోనా చీకటి తరువాత వచ్చిన వెలుగు స్పృహ ఇది. ప్రకృతి నాశనం నేర్పిన పెద్ద గుణపాఠం నుండి నేర్చుకున్న జ్ఞానపాఠం ఇది.
మట్టి ప్రమిదల్లో కాసింత చమురు వేసి పత్తిఒత్తితో ఇంటినిండా వెలుగు నింపడం నిజమైన దీపావళి. చిట్టి చిట్టి పాపల ముసిముసి నవ్వుల వెలుగులో ప్రతి ఇల్లూ నిండిపోవాలి. అమ్మ చేతి మిఠాయిల తీపితో నోరంతా తియ్యదనం రావాలి. చీకటికి భయపడే పిల్లలంతా దీపాల కాంతుల్లో కేరింతలు కొట్టాలి. అమ్మ కొంగు పట్టుకుని వ్రేలాడే గడుగ్గాయలకు ఈ దీపావళి ఓ మధురానుభూతి కావాలి.
పిల్లలూ, పెద్దలూ ఏకమై ఈ దీపావళి సంబురంగా చేసుకోవాలి. పండుగరోజు ఆఫర్లు, ఎక్సేంజుల బాట పట్టకుండా కుటుంబమంతా ఒక్కచోట చేరి ఆనందాల డోలీల్లో ఊయలలూగాలి. చదువుల పేరుతో దూరతీరాలు చేరిన కన్నబిడ్డల రాకతో ఈ పండుగనాడు ప్రతి అమ్మానాన్న హృదయం పలవరించాలి. పేద, ధనిక తారతమ్యం లేకుండా ప్రతి ఒక్క ఇల్లు వెలుగులతో నిండిపోవాలి.
ప్రకృతిని ప్రేమిస్తూ, పర్యావరణాన్ని రక్షిస్తూ ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి. స్వార్థం, అవినీతి, అత్యాశ, కోపం, ద్వేషమనే అజ్ఞాన చీకట్లను పారద్రోలి ప్రేమ, ఆప్యాయత, స్నేహం, సౌభ్రాతృత్వం, మతసామరస్యమనే వెలుగువైపు పయనించే రోజుకు ఈ దీపావళి నాంది పలకాలి.

➡️