పోరాటమే ఊపిరిగా 

discuss about news click editor prabir purkayastha

ఎమర్జెన్సీ నుండి నేటి వరకు

నాడు విద్యార్థిగా… నేడు జర్నలిస్టుగా ..

జైల్లో ఉన్న ప్రబీర్‌ పుర్కాయస్థ జ్ఞాపకాలపై ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో చర్చ

న్యూఢిల్లీ: జైల్లో ఉన్న న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ జ్ఞాపకాలపై ఢిల్లీలోని ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో చర్చ నిర్వహించారు. రచయితలు, జర్నలిస్టులు, విద్యార్థులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు తమ పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. ”కీపింగ్‌ అఫ్‌్‌ ది గుడ్‌ ఫైట్‌: ఎమర్జెన్సీ నుండి నేటి వరకు” అన్న పుస్తకంపై నిర్వహించిన ఈ చర్చా కార్యక్రమానికి లెఫ్ట్‌వర్డ్‌ బుక్స్‌ కో- హౌస్టుగా వ్యవహరించింది. పుర్కాయస్థ రాజకీయ ప్రస్థానం, ఆయన కృషి, క్రియాశీలత దేశంలో చోటుచేసుకున్న పలు రాజకీయ, సామాజిక-ఆర్థిక మార్పులకు ఎంతగానో దోహదకారిగా నిలిచాయని వక్తలు పేర్కొన్నారు. ప్రముఖ రచయిత, చర్చల్లో పాల్గొన్న వక్తల్లో ఒకరైన గీతా హరిహరన్‌ మాట్లాడుతూ, ‘ప్రబీర్‌ను ఒక వ్యక్తి కాదు సమిష్టి శక్తి . ఉద్యమంలోనే పుట్టాడు, ఉద్యమంలోనే ఎదిగాడు. ఇతర ఉద్యమాలతో కలిసి మార్పు కోసం ఉద్యమించారు. ఆయన పోరాటం అసంఖ్యాక ప్రజానీకానికి మెరుగైన జీవితాన్ని ఇవ్వడం కోసం, సమాజంలో మార్పులకు దోహదకారిగా నిలిచింది’, అని చెప్పారు. 1975 ఆగస్టులో అంటే దేశం అంతటా ఎమర్జెన్సీ ప్రకటించిన తరువాత మూడు నెలలకు తీవ్రమైన అణచివేత, ప్రాథమిక హక్కుల హననం సాగింది. ఆ సమయంలో పుర్కాయస్థను జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) క్యాంపస్‌ నుండి ఎత్తుకెళ్లి చెరసాలలో పెట్టారు. అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం (మిసా) కింద కేసు బనాయించారు. అలాగే మొన్న అక్టోబరు3న న్యూస్‌ క్లిక్‌ వ్యవస్థాపక సంపాదకులు ప్రబీర్‌ పుర్కాయస్థను,ఆ వెబ్‌ పోర్టల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధిపతి అమిత్‌ చక్రవర్తిని అరెస్టు చేశారు. దానికి ముందు న్యూస్‌ క్లిక్‌ సిబ్బంది ఆఫీసు క్యాబిన్లపైన, ఇళ్లపైన ఇడి దాడులు సాగాయి. ప్రబీర్‌, అమిత్‌లపై దుర్మార్గమైన చట్టం ఉపా కింద కేసులు బనాయించారు. ప్రబీర్‌ నాడు విద్యార్థిగా, నేడు జర్నలిస్టుగా అరెస్టయ్యారు. 1975లో జెఎన్‌యు విద్యార్థి యూనియన్‌కు ఎన్నికైన అశోక్‌లతా జైన్‌ను బహిష్కరించినందుకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రక నిరసనలో పాల్గొన్నందుకు ప్రబీర్‌ను అపహరించుకుని తీసుకెళ్లి జైలులో పెట్టారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత అంటే 2023డిసెంబరు 15న అదే క్యాంపస్‌లో నిరసనలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందుకు సంబంధించి 16 మంది విద్యార్థులకు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్‌ నోటీసులు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని హైకోర్టు ఉపా చట్టం కింద అరెస్టయిన జర్నలిస్టు ఆసిఫ్‌ సుల్తాన్‌కు అయిదేళ్ల తరువాత మొన్న డిసెంబరు 12న జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టు విముక్తి కల్పించింది. ప్రబీర్‌ పుస్తకం, గురువారం నాటి సమాంతర చర్చలు భారత ప్రజాస్వామ్యంపై ప్రజల్లో స్పృహ కొరవడడానికి కారణాలను విశ్లేషించాయి. ఎమర్జెన్సీ అనుభవాలను ప్రజల స్మృతి పథం నుంచి చెరిపివేయడం, హక్కులు, స్వేచ్ఛపై ఈ రోజు ప్రజల్లో నెలకొన్న నిర్లిప్తతే దీనికి కారణమని వక్తలు అభిప్రాయపడ్డారు. భారత సుప్రీం కోర్టులో సీనియర్‌ న్యాయవాది సంజరు హెగ్డే మాట్లాడుతూ, ‘మా స్వేచ్ఛను ఒక గొప్ప వ్యక్తి పాదాల వద్ద ఉంచకూడదని, మేము నిర్ణయించుకున్నాము’ అన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి ఆర్‌ అంబేద్కర్‌ మాటలను సందర్భోచితంగా ఉటంకించారు. మళ్లీ అటువంటి పరిస్థితి ఎన్నడూ రానివ్వకూడదని ఆయన ఉద్బోధించారు. ఉమర్‌ ఖలీద్‌తో సహా పలువురు కార్యకర్తల అరెస్టుల గురించి హెగ్డే ప్రస్తావిస్తూ, ”మనకు లిఖితపూర్వక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగాన్ని నిర్వహించే సంస్థలుఉన్నాయి, కానీ ఈ సంస్థలు విఫలమైనప్పుడు , మనస్సాక్షి ఉన్న ఈ పురుషులు, స్త్రీలు ముందుకొచ్చి మంచి పోరాటం సాగిస్తున్నారు, రాజ్యాంగం పౌరునికి, పౌరునికి మధ్య ఒక గంభీరమైన బంధాన్ని ఏర్పరిచింది అదే ఈ దేశ ప్రజలంతా ఐకమత్యంగా కలిసి పని చేయడం, కలిసి జీవించడం అని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని సమర్థించినందుకు పుర్కాయస్థ తన జీవితకాలంలో రెండుసార్లు బాధితుడయ్యాడని హెగ్డే పేర్కొన్నారు. పాత్రికేయుడు తన పుస్తకంలో పేర్కొన్న మాటలనే ఆయన ప్రయోగిస్తూ, ఒక మంచి పౌరుణ్ణి బాధితుడ్ని చేయడమంటే చరిత్ర సష్టిలో మన భాగస్వామ్యాన్ని హరించడమేనని ఆయన అన్నారు. చరిత్ర నిర్మాతలు ప్రజలేనన్న విషయాన్ని పుర్కాయస్థ తన పుస్తకంలో నొక్కి వక్కాణించిన విషయాన్ని హెగ్డే ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్యానెల్‌ చర్చలో పరిశోధకురాలు ఇంద్రాణి మజుందార్‌, సఫాయి కరంచారి ఆందోళన్‌ (ఎస్‌కెఎ) కార్యకర్త, వ్యవస్థాపక సభ్యుడు బెజవాడ విల్సన్‌, హిందూ పబ్లిషింగ్‌ గ్రూప్‌ డైరెక్టర్‌, జర్నలిస్ట్‌ ఎన్‌. రామ్‌ కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. భారతదేశంలో ప్రస్తుత కాలాన్ని ”హిందుత్వ నిరంకుశ పాలన”గా ఎన్‌రామ్‌ పేర్కొన్నారు. ”సంస్థలు బంధించబడుతున్నాయి… మానిప్యులేట్‌ చేయబడు తున్నాయి మీడియా స్వేచ్ఛ పూర్తి స్థాయి దాడిలో ఉంది” అని రామ్‌ హెచ్చరించారు. న్యూస్‌ క్లిక్‌పై జరిగిన దాడుల గురించి ఎన్‌ రామ్‌ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, ఇదంతా మెకార్డైట్‌ ప్రచారం అని, మీడియాకే పరిమితని అనుకోరాదని, కొత్త సామాజిక-రాజకీయ, సైద్ధాంతిక నిర్మాణంలో భాగంగా సంఫ్‌ు పరివార్‌ సమాచార ఆవరణ వ్యవస్థలోకి పెద్దయెత్తున విషాన్ని చొప్పిస్తోందని, ఈ ప్రమాదకరమైన ధోరణికి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన కోరారు. బెజవాడ విల్సన్‌ మాట్లాడుతూ, ”ప్రతిపక్ష-ముక్త్‌ భారత్‌” (దేశంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయడం) కోసం చేస్తున్న యత్నాలను తిప్పికొట్టాలన్నారు. ‘నిరంకుశ రాజ్యానిక’ి వ్యతిరేకంగా ప్రజలంతా కలిసికట్టుగా పోరాడాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. నిరాశావాదాన్ని తిరస్కరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పుర్కాయస్థను ఉటంకిస్తూ, హరిహరన్‌ చివరిలో ఇలా ముక్తాయించారు, ”మన ఇటీవలి గతం గురించిన కథ అణచివేతను వివరించడానికే పరిమితం కారాదు, మనం . చూసిన, రాసిన ప్రతిఘటన గురించి పేర్కొనకుంటే ఆ కథ అసంపూర్ణంగానే మిగిలిపోతుంది” అని చెప్పారు.

➡️