మైనారిటీ విద్యార్థుల పట్ల వివక్ష

Dec 10,2023 11:01 #SFI

మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ ఎత్తివేసేందుకు కేంద్రం కుయుక్తులు

ఎంఎఎన్‌ఎఫ్‌ని పునరుద్ధరించాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :   మైనార్టీలకు చెందిన విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఆర్థిక చేయూతనందించడానికి ఉద్దేశించిన మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ (ఎంఎఎన్‌ఎఫ్‌)ను క్రమంగా  ఎత్తివేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇటీవల కుయుక్తులు పన్నుతోంది. దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎంఎఎన్‌ఎఫ్‌ పొందుతున్న వారికిచ్చే మొత్తాన్ని పెంచకుండా మైనార్టీ విద్యార్థుల పట్ల మోడీ సర్కార్‌ వివక్షను కొనసాగిస్తోందని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) విమర్శించింది. ఈ మేరకు శనివారం ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి విపి సాను, మయూక్‌ బిశ్వాస్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

రీసెర్చ్‌ ఫెలోషిప్‌లు షెడ్యూల్డ్‌ కులాల కోసం నేషనల్‌ ఫెలోషిప్‌ (ఎన్‌ఎఫ్‌ఎస్సి), షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ కోసం నేషనల్‌ ఫెలోషిప్‌ (ఎన్‌ఎఫ్‌ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతుల కోసం నేషనల్‌ ఫెలోషిప్‌ (ఎన్‌ఎఫ్‌ఓబిసి), మైనారిటీ విద్యార్థులకు మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ (ఎంఎఎన్‌ఎఫ్‌)లకు జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (జెఆర్‌ఎఫ్‌)లతో సమానంగా ఇవ్వడం తప్పనిసరి అని తెలిపారు. ‘జెఆర్‌ఎఫ్‌ కోసం రూ.31,000 నుండి రూ.37,000, ఎస్‌ఆర్‌ఎఫ్‌ కోసం రూ.35,000 నుండి రూ.42,000 రీసెర్చ్‌ ఫెలోషిప్‌లను ఈ సంవత్సరం పెంచడానికి యుజిసి ఆమోదించింది. ఈ ఆమోదం తరువాత ఎన్‌ఎఫ్‌ఎస్సి, ఎన్‌ఎఫ్‌ఎస్టీ, ఎన్‌ఎఫ్‌ఓబిసి, ఫెలోషిప్‌ గ్రహీతలకు పెండింగ్‌లో ఉన్న బకాయిలతో వారి సవరించిన ఫెలోషిప్‌ మొత్తాలను పొందారు. అయినప్పటికీ, ఎంఎఎన్‌ఎఫ్‌ ఫెలోషిప్‌ దారులకు మాత్రమే అందలేదు. ఫెలోషిప్‌ పెంపునకు సంబంధించి ఎటువంటి అప్‌ డేటు వారికి నేటి వరకు అందలేదు. దీనిపై ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

మైనార్టీ విద్యార్థులకు అందజేసేందుకు ఉద్దేశించిన ఈ ఫెలోషిప్‌ను ఎత్తివేసేందుకు బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. యుజిసి జెఆర్‌ఎఫ్‌, ఎన్‌ఎఫ్‌ఎస్సి, ఎన్‌ఎఫ్‌ఎస్టీ, ఎన్‌ఎఫ్‌ఓబిసి, వంటి ఇతర ఫెలోషిప్‌లతో పోలిస్తే మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ (ఎంఎఎన్‌ఎఫ్‌) పట్ల కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని, వివక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని, మిగిలిన ఫెలోషిప్‌తో సమానంగా ఎంఎఎన్‌ఎఫ్‌ను పెంచాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని విశ్వవిద్యాలయ విద్యార్థులకు పిలుపు ఇచ్చారు.

➡️