‘డిజిటల్‌ అరెస్ట్‌’ ఇదో కొత్త తరహా మోసం

Feb 24,2024 10:47 #'Digital Arrest', #fraud

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ‘దేశ వ్యతిరేక, సంఘ విద్రోహ కార్యక్రమాల్లో మీరు పాల్గోన్నారని, మీమీద విచారణ ప్రారంభమైందని, ఆన్‌లైన్‌ విచారణకు హాజరు కావాలని’ మీకు ఫోన్లు వస్తున్నాయా? … కంగారు పడకండి. పోన్‌ చేసిన వారు ఎంత పెద్ద అధికారులమని చెప్పినా ఆందోళన పడకండి! భయంతో వారు చెప్పినవన్నీ చేసేస్తే, భారీగా మోసపోయి చేతులు కాల్చుకోవాల్సివస్తుంది. ఇటీవల కాలంలో ఈ తరహా మోసాలు పెరిగిపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు హెచ్చరికలు అందాయి. ఈ విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలని కేంద్ర అధికారులు సూచించారు. రిజర్వ్‌ బ్యాంకు అధికారులు ఇటీవల కనుగొన్న ఈ మోసాన్ని ‘డిజిటల్‌ అరెస్ట్‌’ గా వ్యవహరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో మొట్టమొదటిసారి ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత గుజరాత్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఈ తరహా సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీనిలో తమను తాము అత్యున్నత దర్యాప్తు సంస్థల ఉన్నత స్థాయి అధికారులమని చెప్పుకుంటూ గుర్తు తెలియని వ్యక్తులు భారీ మొత్తంలో నగదును, కొన్ని సందర్భాల్లో ఆస్తులను కూడా కాజేస్తున్నట్లు సమాచారం. నోయిడా ఘటనను అధ్యయనం చేస్తే అక్కడి ఒక మహిళను లక్ష్యంగా చేసుకున్న కొందరు తమను తాము అత్యున్నతస్థాయి అధికారులుగా చెప్పుకుంటూ ఆమెకు ఫోన్‌ చేశారు. ఆమె ఆధార్‌ నంబర్‌నో, సిమ్‌కార్డునో క్రిమినల్‌ కార్యక్రమాలకు ఉపయోగించినట్లు నమ్మించారు. దానికి సంబంధించి వీడియో విచారణకు హాజరు కావాలని ఒత్తిడి చేశారు. దీనికి అంగీకరించకపోవడంతో కేసుల తీవ్రతను మరింత పెంచుతూ భయోత్పాతానికి గురిచేసే ప్రయత్నం చేశారు. బాధితురాలికి ఐవిఆర్‌ (ఇరటరేక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌) కాల్‌ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ బాధితురాలి పేరున మరో సిమ్‌ ఉన్నట్లు గుర్తిరచామని, ఆ సిమ్‌ను ముంబయిలో ఒక నేరానికి వినియోగించారని, దానిపై ఐపిఎస్‌ అధికారి వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా విచారిరచనున్నారని, అరదులో పాల్గనాలని ఒత్తిడిచేశారు. వీడియోకాల్‌ ద్వారా జరిపిన విచారణలో అరెస్ట్‌ వారెంటును కూడా చూపించినట్లు తెలిసింది. కేసు మాఫీ చేయడానికి పెద్ద మొత్తంలో నగదు డిమాండ్‌ను చేసిన వారు. ఆ తరువాత జాతీయ భద్రత పేరుతో ఈ విషయాలను ఎవరికీ చెప్పవద్దని హెచ్చరిరచారు. బ్యాంకు ఖాతాల నుండి ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు ఉపసంహరణ జరగడంతో, అనుమానంతో రిజర్వుబ్యాంకు చేసిన విచారణలో అసలు విషయం వెలుగులోకివచ్చింది. బ్యాంకు అధికారులు దీనిని పోలీస్‌ల దృష్టికి తీసుకుపోవడంతో జరిపిన విచారణలో మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఈ తరహా మోసాలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఆధార్‌, సిమ్‌కార్డు, బ్యాంకు ఖాతా, ఎటిఎం కార్డు, పాన్‌కార్డులతో పాటు ఇతర ఏ గుర్తింపు కార్డుతోనైనా ఈ తరహా మోసం చేసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

➡️