చెప్పలేదు.. చెయ్యలేదు..

Apr 3,2024 23:20

చిలకలూరిపేట పట్టణం 26వ వార్డులోని సచివాలయం వద్ద చెట్లకింద, అరుగుల మీద లబ్ధిదార్ల నిరీక్షణ
ప్రజాశక్తి – చిలకలూరిపేట :
సమాచారం తెలపడంలో, వసతుల కల్పనలో నిర్లక్ష్యం కారణంగా వృద్ధులైన పింఛనుదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పింఛనెప్పుడిస్తారా? అని రోజంతా చెట్లకింద, అరుగులపైన పడిగాపులు కాశారు. ఎన్నికల నేపథ్యంలో సచివాలయాల ద్వారానే నేరుగా పింఛన్ల పంపిణీ చేపట్టిన క్రమంలో బుధవారం ఉదయం నుంచే పంపిణీ చేస్తారని భావించిన లబ్ధిదారులు సచివాలయాల వద్దకు 11 గంటలకే చేరుకున్నారు. మరోవైపు డబ్బుల కోసం బ్యాంకుల వద్దకెళ్లిన సచివాలయ అడ్మిన్లు నగదు కోసం సాయంత్రం వరకూ నిరీక్షించారు. 4.30 గంటల తర్వాత నగదు ఇవ్వడంతో 5 గంటల తర్వాత లబ్ధిదార్లకు పంపిణీని ప్రారంభించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు టెంటు, తాగునీటి సదుపాయం, కుర్చీలు ఏర్పాటు చేయకపోవడంతో లబ్ధిదార్లు నానా అగచాట్లు పడ్డారు. ఇదిలా ఉండగా పట్టణంలోని 27 వార్డుకు సంబంధించిన 23వ సచివాలయం పరిధిలో 485 మందికి రూ.14 లక్షల 70 వేలు పింఛను ఇవ్వాల్సి ఉండగా బుధవారం రూ.6 లక్షలే ఇచ్చారని 98 మందికి పంపిణీ చేశారు. మళ్లీ బ్యాంకు నుండి డబ్బు తెచ్చి మిగతావారికి ఇస్తామని సచివాలయ అడ్మిన్‌ తెలిపారు. 26 వార్డులో 342 మందికి రూ.10 లక్షల 20 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.6 లక్షలే వచ్చినట్లు తెలిపారు. ఈ వార్డులో 57 మందికి పంపిణీ చేశారు. మొత్తంగా పట్టణంలో 23 శాతం మందికి పింఛనును పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.దీనిపై పట్టణ కమిషర్‌ సిహెచ్‌ గోవిందరాబు స్పందిస్తూ పట్టణ పరిధిలోని 29 సచివాలయల పరిధిలో 11,334 మందికి రూ.3 కోట్ల, 42 లక్షల 39 వేల 500 మొత్తం ఇవ్వాల్సి ఉందని, ఒకపూట ఆలస్యమైనా అందరికీ పింఛను అందిస్తామని, ఇళ్లకు వచ్చి ఇచ్చేలా చూస్తామని చెప్పారు. సచివాలయ సిబ్బంది ఉదయం 6 గంటల నుంచి 10 గంటల్లో.. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకూ పింఛను అందిస్తారని చెప్పారు. ఎవ్వ రూ కంగారు పడొద్దని, సచివాలయాల్లో పింఛను తీసుకు నేవారి కోసం ఒక ఉద్యోగిని ఏర్పాటు చేస్తామని అన్నారు.
ప్రజాశక్తి-ముప్పాళ్ల : మండలంలోని పలు సచివాలయాల వద్ద సామాజిక పింఛను కోసం లబ్ధిదారులు బుధవారం ఉదయం నుంచే బారులు తీరారు. మధ్యాహ్నానికి సచివాలయాల సిబ్బందికి డబ్బులు అందడంతో వెంటనే పంపిణీ చేపట్టారు. మధ్యలో సుమారు అరగంట పాటు సర్వర్‌ మొరాయించింది. మధ్యాహ్నం వరకూ 5 సచివాలయ పరిధిలోని గ్రామాల వరకే బ్యాంకులో డబ్బులిచ్చారు. మిగిలిన సచివాల యాలకు సాయంత్రం 4 గంటల సమయంలో అందజే శారు. ముందుగా ఇచ్చిన సచివాలయాలలో పంపిణీ 80 శాతం పూర్తవ్వగా ఆలస్యంగా బ్యాంకు నుంచి నగదు తెచ్చుకున్న సచివాలయాలలో 30-40 శాతం వరకే పంపిణీ చేశారు. పంపిణీ నేపథ్యంలో సచివాలయాల వద్ద టెంట్‌, తాగునీరు సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

➡️