ఒక్క పరిశ్రమనైనా తెచ్చారా?

  •  పదేళ్లలో రాష్ట్రం సర్వనాశనం
  •  అంబాజీపేట బహిరంగ సభలో వైఎస్‌ షర్మిల

ప్రజాశక్తి – అమలాపురం/అంబాజీపేట : ఈ పదేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా? అని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిళ ప్రశ్నించారు. పదేళ్ల టిడిపి, వైసిపి పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందన్నారు. ఎపి న్యారు యాత్రలో భాగంగా మంగళవారం డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. వైసిపి, టిడిపి, జనసేన పార్టీలకు ఓటు వేస్తే అది బిజెపికి వెళ్తుందన్నారు. ఏ మేరకు హామీలను నెరవేర్చారని జగన్‌కు ఓటెయ్యాలని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ తెచ్చిన సంక్షేమ పథకాలను జగన్‌ పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శించారు. 2014 నుంచి 2024 వరకు పదేళ్ల పాటు పాలించిన చంద్రబాబు, జగన్‌లు రాష్ట్రాన్ని 20 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లారన్నారు. దళితుల పట్ల ముఖ్యమంత్రి జగన్‌కు ప్రేమ ఉంటే శిరోముండనం చేసి దళితులను అవమానించిన తోట త్రిమూర్తులకు మండపేట టికెట్‌ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దళిత డ్రైవర్‌ను చంపి డోర్‌ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం దారుణమన్నారు. ప్రజల పక్షాన ప్రతిపక్షం, పాలక పక్షాలు నిలవకుండా బిజెపికి తొత్తులుగా మారాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే భవిష్యత్తు తరాలు, పేదల జీవితాలు బాగుపడతాయని హామీ ఇచ్చారు. ఇండియా వేదిక పేరుతో కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ, ఆప్‌ తదితర పార్టీలు పోటీ చేస్తున్నాయని, ప్రజలందరూ మద్దతునివ్వాలని కోరారు. పి.గన్నవరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండేటి చిట్టిబాబు, అమలాపురం పార్లమెంటు అభ్యర్థి జంగా గౌతమ్‌లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. సిపిఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపిని, ఆ పార్టీతో అంటకాగుతున్న వైసిపి, టిడిపి, జనసేన పార్టీలను ఓడించాలని, ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బిజెపి అవలంభిస్తోన్న మతోన్మాద విధానాలను తిట్టుకొట్టాలని, లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కొప్పుల సత్తిబాబు మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో బిజెపిని తరిమికొట్టాలన్నారు. ఈ సమావేశంలో రాజమండ్రి పార్లమెంట్‌ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ ఆరీఫ్‌, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా నియోజకవర్గాల కాంగ్రెస్‌ అభ్యర్థులు కామన ప్రభాకరరావు, అయితాబత్తుల సుభాషిణి, పాలెపు ధర్మారావు, రౌతు ఈశ్వరరావు, కోట శ్రీనీవాసరావు, సరెళ్ల ప్రసన్నకుమార్‌, ఎఐసిసి సభ్యులు యార్లగడ్డ రవీంద్ర పాల్గొన్నారు.

➡️