ఏ తప్పూ చేయలేదు : లోకల్‌ బాయ్ నాని

Nov 25,2023 10:05 #Andhra Pradesh, #fishing harbour

 

హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ  27కి వాయిదా

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : విశాఖలోని ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో పోలీసులు తనను ప్రధాన నిందితునిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నానని యూట్యూబర్‌ లోకల్‌ బారు నాని అన్నారు. హార్బర్‌లో బోట్లు కాలిపోయిన ఘటనకు సంబంధించి నాని హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని విశాఖ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా నాని మీడియాతో మాట్లాడుతూ.. హార్బర్‌లో జరిగిన ప్రమాదంలో తాను ఏ తప్పు చేయలేదని తెలిపారు. సంఘటన జరిగిన రోజున సాయంత్రం 6 నుంచి రాత్రి 11:50 గంటల వరకు తన భార్య శ్రీమంత వేడుకల్లో పాల్గొన్నానని, హార్బర్‌లో ప్రమాదం గురించి తెలియడంతో మంటలు ఆర్పేందుకు అక్కడికి వెళ్లానని చెప్పారు. ఆ సమయంలోనే వీడియో తీసి అప్లోడ్‌ చేశానని తెలిపారు. తాను ఆ రోజు ఓ హోటల్‌లో ఉన్నానని, లోపలకు ఎప్పుడు వెళ్లిందీ ? బయటకు వచ్చిందీ? అన్నీ సిసి కెమెరాల్లో రికార్డు అయ్యాయన్నారు. వాటిని పోలీసులు పరిశీలించినప్పటికీ తనను ఈ ప్రమాదంలో ప్రధాన నిందితునిగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన అనంతరం తనను విచారణ పేరుతో అదుపులోకి తీసుకొని 20 నుండి 23వ తేదీ వరకూ మానసికంగా, శారీరకంగా వేధించారని, దుర్భషలాడారని తెలిపారు. తనకు సంబంధం లేదని ఎంత చెప్పినా వినలేదన్నారు. తన లాయర్ల ద్వారా హైకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారన్నారు.

➡️