42కి పెరిగిన డయేరియా కేసులు

Feb 12,2024 10:12 #42, #Diarrhea cases, #guntur, #increased
  • జిజిహెచ్‌లో24 గంటలు వైద్యం
  • హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు
  • కలెక్టర్‌, కమిషనర్‌తోమంత్రి సమీక్ష

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి, గుంటూరు : గుంటూరులో తాగునీటిలో ఏర్పడిన సమస్య వల్ల వాంతులు, విరోచనాలు, తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 42కు పెరిగింది. దీంతో, జిజిహెచ్‌లో 24 గంటలు వైద్య సేవలందిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని తెలిపారు. బాధితుల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌ ఏర్పాటు చేశామని, 8341396104 నంబర్‌కు ఫోన్‌ చేసి సహాయం పొందవచ్చని చెప్పారు. అధికారులతో మంత్రి సమీక్షించారు.

శనివారం సాయంత్రానికి డయేరియా బాధితుల సంఖ్య 21కి చేరగా, వీరిలో ఒక మహిళ మరణించారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు మరో 21 మంది ఆస్పత్రిలో చేరారు. అయితే, శనివారం ఆస్పత్రికి వచ్చి చికిత్సలు చేయించుకున్న వారిలో ఏడుగురు ఆరోగ్యంగా ఉండడంతో డిశ్ఛార్జి చేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ చెప్పారు. ఆదివారం ప్రత్యేకంగా బాధితుల కోసం ఏర్పాటు చేసిన పోస్ట్‌ ఆపరేటివ్‌ వార్డును ఆయన పరిశీలించారు. పలువురు రోగులు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఐసియుకి తరలించారు. మరో ముగ్గురు చిన్నారుల పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. వాంతులు, విరోచనాల వల్ల నిస్సత్తువ ఏర్పడడంతో ఎక్కువ మందిలో ఆందోళన కనిపిస్తోందని సూపరింటెండెంట్‌ చెప్పారు. అధిక రక్తపోటు, షుగర్‌ ఉన్న వారిని కూడా గుర్తించి వైద్యం అందిస్తున్నామని ఆయన తెలిపారు. పోస్ట్‌ ఆపరేటివ్‌ వార్డ్‌లో 40 పడకలను అందుబాటులో ఉంచామని చెప్పారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నీటి కాలుష్యం వల్ల అనేక మంది ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. పలువురు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో చేరారు. మెడికల్‌ షాపుల్లో మందులు తెచ్చుకుని ఇళ్ల వద్ద చికిత్సలు పొందే వారు, ఆర్‌ఎంపిల వద్ద చికిత్సలు చేయించుకుంటున్నా వారూ ఉన్నారు. పులిచింతల నుంచి నీరు కలుషితమై వస్తోందని, ఉండవల్లి పంపింగ్‌ సెంటర్‌లో పూర్తి స్థాయిలో క్లీనింగ్‌ కావడం లేదని, అందువల్ల ప్రజలు నీటిని కాచి చల్లార్చుకొని తాగాలని అధికారులు ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. డయేరియా ప్రబలి ప్రజలు ఆస్పత్రులకు వెళ్తున్నారని విమర్శలు రావడంతో నగర కమిషనర్‌ చేకూరి కీర్తి ఆదివారం తెల్లవారుజామున నీటి సరఫరా జరిగే ప్రాంతాల్లో నేరుగా కుళాయిల వద్ద శ్యాంపిల్స్‌ తీసి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. క్లోరినేషన్‌ తగిన మోతాదులోనే ఉందని ఆమె చెప్పారు. నీటి పరిశుభ్రతలో లోపాలులేవని, వాంతులు, విరోచనాలకు ఇతర కారణాలు కూడా ఉంటున్నాయని అధికారులు సమర్థించుకుంటున్నారు.

ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : మంత్రి రజని

గుంటూరు నగరంలో తాగునీటి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ, నగరపాలక సంస్థ అన్ని రకాల నివారణ చర్యలూ తీసుకుంటున్నట్లు తెలిపారు. నగరంలో ప్రబలిన డయేరియాపై ఆదివారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌, నగర కమిషనర్‌, మేయర్‌ ఇతర అధికారులతో ఆమె సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శుభ్రమైన తాగునీటిని అందించటానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. బాధితుల నివాస ప్రాంతాల్లో 32 టీములతో ఇంటింటి సర్వే చేపడుతున్నామని, జిజిహెచ్‌లో, స్థానిక యుపిహెచ్‌సిలల్లో 24 గంటల వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. జిఎంసి నిర్లక్ష్యం వల్లే డయేరియా ప్రబలిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నా ఎందుకు శాశ్వత నివారణ చర్యలు తీసుకోవట్లేదని విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, కమిషనర్‌ కీర్తి చేకూరి పాల్గొన్నారు.

➡️