రాజధాని నమూనా గ్యాలరీ ధ్వంసం

Apr 18,2024 00:12

ధ్వంసమైన రాజధాని అమరావతి నమూనా గ్యాలరీ
ప్రజాశక్తి – తుళ్లూరు :
ప్రధాని మోడీ రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శిలాఫలకం పక్కనే ఉన్న రాజధాని నమూనా గ్యాలరీని దుండగులు ధ్వంసం చేశారు. ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని అమరావతి నిర్మాణానికి 2015 అక్టోబరు 22న శంకుస్థాపన చేసిన ప్రదేశంలో అమరావతి ముఖచిత్రం, చారిత్రక ఘట్టాలు, మ్యాప్‌లు, కట్టడాలకు సంబంధించిన నమూనాలు, విశేషాలతో ఏర్పాటు చేసిన గ్యాలరీని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడాన్ని రైతులు బుధవారం గుర్తించారు. రక్షణ చర్యలు తీసుకోక పోవడంతో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారని స్థానిక రైతులు అన్నారు. రాజధాని అమరావతి నమూనా గ్యాలరీ ఉన్న భవనం వద్ద టిడిపి ప్రభుత్వంలో రక్షణ చర్యలు చేపట్టారు. గేట్లు ఏర్పాటు, పోలీసులను కాపలా ఉంచడం లాంటి చర్యలు తీసుకున్నారు. వైసిపి అధికారం చేపట్టిన తర్వాత పోలీసు కాపల ఎత్తివేశారు. దీంతో ఆకతాయిలు రక్షణగా ఏర్పాటు చేసిన గేట్లు పగలగొట్టడం, మద్యం సేవించడం చాలా కాలంగా జరుగుతోందని, ఎవరికి చెప్పాలో కూడా తెలియని అయోమయంలో ఉన్నామని ఉద్దండరాయునిపాలేనికి చెందిన రైతు రామారావు చెప్పారు. ఇప్పుడు ఏకంగా నమూనా గ్యాలరీనే ధ్వంసం చేశారని వాపోయారు. ఈ చర్యను గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్‌డిఎ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, అమరావతి దళిత జెఎసి, టిడిపి నాయకులు పులి చిన్నా తీవ్రంగా ఖండించారు. సంఘటనా ప్రదేశాన్ని వారు పరిశీలించారు.

➡️