ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటు : రాష్ట్ర వ్యాప్తంగా సాబ్జీకి ఘన నివాళి

  • సమ్మె శిబిరం వద్ద అంగన్‌వాడీల శ్రద్ధాంజలి

ప్రజాశక్తి – యంత్రాంగం : ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికనేత ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతి ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఆయన మృతికి యుటిఎఫ్‌, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నివాళులర్పించారు. సమ్మె శిబిరాల వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.

ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ ఆకస్మిక మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. అల్లూరి జిల్లా అరకులోయలోని ఆదివాసీ గిరిజన సంఘం భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో సాబ్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళ్లర్పించారు. సాబ్జీ మృతి ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర పాల్గొన్నారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోని పలుచోట్ల సాబ్జీ సంతాప సభలు జరిగాయి. పలుచోట్ల అంగన్‌వాడీలు శ్రద్ధాంజలి ఘటించారు.

కాకినాడ సుందరయ్య భవనంలో నిర్వహించిన సంతాప సభలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు పాల్గొని, మాట్లాడారు. మండలిలో ఉపాధ్యాయ, ఉద్యోగుల, కార్మికుల వాణిని సాబ్జీ బలంగా వినిపించారన్నారు. యుటిఎఫ్‌ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. సాబ్జీ చిత్రపటానికి అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మండపేటలో ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పల్నాడు జిల్లా పెద్దకొరపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నివాళులర్పించారు. ఏలూరులోని స్థానిక పవర్‌పేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. సాబ్జీ జీవితాన్ని, ఉద్యమాల్లో ఆయన చేసిన కృషిని, ఆయన లేని లోటుని వివరిస్తూ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మంగరాజు పాట పాడారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ.. ఉద్యమబాటలో నడుస్తూ సాబ్జీ తన తుదిశ్వాస వదలడం అందరి హృదయాలను కలచివేసిందన్నారు. ఆగిరిపల్లి, భీమడోలు, చింతలపూడి, ద్వారకా తిరుమల, పశ్చిమగోదావరి జిల్లాలో పలుచోట్ల సిపిఎం, యుటిఎఫ్‌ ఆధ్యర్యాన సంతాప సభలు నిర్వహించారు. అంగన్‌వాడీలు తమ సమ్మె శిబిరాల వద్ద కొద్దిసేపు మౌనం పాటించి నివాళులర్పించారు.

తిరుపతిలో అంగన్‌వాడీ కార్యకర్తలు నివాళులు అర్పించారు. నెల్లూరు జిల్లాలో యుటిఎఫ్‌ నాయకులు సంతాపం తెలిపారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో సాబ్జీ చిత్ర పటానికి నివాళులర్పించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు, బేతంచెర్ల, ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డలోని అంగన్‌వాడీ దీక్షా శిబిరాల వద్ద సాబ్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు సంఘాల ఆధ్వర్యంలో నివాళుల ర్పించారు. ఎన్‌టిఆర్‌ జిల్లా తిరువూరు సుందరయ్య విజ్ఞాన్‌ కేంద్రంలో సాబ్జీ చిత్రపటానికి జోహార్లు అర్పించారు.

సిఐటియు రాష్ట్ర కమిటీ నివాళి

పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీకి సిఐటియు రాష్ట్ర కమిటీ ఘన నివాళులర్పించింది. యూనియన్‌ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నాడు సాబ్జీ సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా సాబ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళలర్పించారు. ఉపాధ్యాయ, ప్రజా ఉద్యమాల్లో సాబ్జి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎవి నాగేశ్వరరావు, సిహెచ్‌ నర్సింగరావు, ఆఫీస్‌ బేరర్లు జి బేబిరాణి, కె సుబ్బరావమ్మ, పి అజరుకుమార్‌, కెఆర్‌కె మూర్తి, కె ఉమామహేశ్వరరావు, ఆర్‌వి నర్సింహారావు, దయ రమాదేవి, నర్సింహులు, అంజి, ఎన్‌ వీణ తదితరులు పాల్గొన్నారు.

➡️