డిజైన్‌స్లేట్‌ పరిశ్రమను ఆదుకోవాలి

Dec 11,2023 20:27 #CH Narsingrao, #CITU
  • సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌ (ప్రకాశం జిల్లా) : డిజైన్‌ స్లేట్‌ పరిశ్రమను వెంటనే ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు డిమాండ్‌ చేశారు. ప్రకాశం జిల్లా పారిశ్రామికవాడలోని పలకల పరిశ్రమ, క్వారీలను సిఐటియు బందం సోమవారం సందర్శించింది. ఈ సందర్భంగా సిహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ డిజైన్‌ స్లేట్‌ పరిశ్రమపై రాయల్టీ, లైసెన్స్‌ అనే పేరుతో భారీగా పన్నులు విధించడంతో పరిశ్రమ పూర్తిగా అంతరించిపోయే విధంగా ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. వెంటనే పలకల పరిశ్రమ పునరుద్ధరణ కోసం తగు చర్యలు తీసుకొని పరిశ్రమలను ఆదుకోవాలని కోరారు. కరువు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న మార్కాపురం ప్రాంతంలో ఉపాధినిస్తున్న అతి పెద్ద పరిశ్రమ డిజైన్‌ స్లేట్‌ అని తెలిపారు. నాడు పరిశ్రమలో పది వేల మంది కార్మికులతో నిత్యం పని జరుగుతూ ఉండేదని, నేడు వెయ్యి మంది లోపు మాత్రమే పనిచేస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితికి ప్రభుత్వమే కారణమని అన్నారు. ప్రభుత్వం వెంటనే పరిశ్రమపై భారీ మొత్తంగా విధిస్తున్న పన్నులు తగ్గించాలని, రాయితీ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ కట్టడాలకు డిజైన్‌ స్లేట్‌ వాడే విధంగా నిర్ణయం తీసుకోవాలని, కార్మికులకు ఉపాధి పెంచే మార్గాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్‌, అధ్యక్ష, కార్యదర్శులు కె సుబ్బరాయుడు, పి రూబెన్‌, డిజైన్‌ స్లేట్‌ యూనియన్‌ అధ్యక్షులు బాలశేషయ్య, వెంకటరెడ్డి, ప్రకాశం, రాములు పాల్గొన్నారు.

➡️