అర్హుల ఓటు తొలగించడం అప్రజాస్వామికం

  • రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ

ప్రజాశక్తి – దుగ్గిరాల (గుంటూరు జిల్లా): ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, అర్హుల ఓటు తొలగించవద్దని రాష్ట్ర మాజీ ఎలక్షన్‌ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు జిల్లాలోని తన స్వగ్రామమైన దుగ్గిరాలలో ఆయన శనివారం పర్యటించారు. ఇటీవల ఒకే పోలింగ్‌ కేంద్రంలో 23 ఓట్లు తొలగించారని వచ్చిన ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించారు. ముందుగా గ్రామంలోని అంబేద్కర్‌, బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఓటు కోల్పోయిన ఓటర్లు రాజ్యాంగం ప్రకారం తమ హక్కులు కాపాడాలని అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదుగురికన్నా ఎక్కువ మంది ఓటు తొలగించే పరిస్థితి ఏర్పడితే త్రిసభ్య కమిటీ విచారణ జరిపిన అనంతరం నిర్ణయం తీసుకోవాలన్నారు. కానీ ఫారం-7ని దుర్వినియోగం చేసి వివక్షతో ఓట్లు తొలగించారని విమర్శించారు. అక్రమంగా ఓట్లు తొలగించిన వారిపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుంటుందని ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని ఉద్యోగులను హెచ్చరించారు. ప్రధాని మోడీ గాంధీనగర్‌లో, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, మూలాలను మరచిపోకుండా తమ సొంత ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం అభినందనీయమని అన్నారు. ఉద్యోగులు కూడా విధులు ఎక్కడ నిర్వహిస్తున్నా తమ సొంత ఊళ్లలో ఓటు హక్కు కలిగి ఉండడం మంచి విషయమని, అయితే వారు అక్కడ ఉండడంలేదన్న కారణంగా ఓట్ల తొలగింపు సరికాదని తెలిపారు.

➡️