రైతులపై రాక్షసత్వం

Feb 24,2024 07:15 #Editorial

                   పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణ మాఫీ తదితర డిమాండ్లతో రైతులు బుధవారం చేపట్టిన ‘ఢిల్లీ చలో’ను పంజాబ్‌-హర్యానా సరిహద్దులో పోలీసులు రక్తసిక్తం కావించడం సర్కారు అమానుషత్వానికి పరాకాష్ట. హర్యానా బిజెపి ప్రభుత్వ క్రూరత్వానికి శుభకరణ్‌ సింగ్‌ అనే 21 ఏళ్ల యువ రైతు బలికాగా మరో 25 మంది గాయపడ్డారు. పంటలకు కనీస మద్దతు ధర కావాలని కోరడమే నేరమన్నట్లు హర్యానా ప్రభుత్వం అన్నదాతలపై ఉక్కుపాదం మోపింది. రైతులను శత్రువుల్లా చూసి, వారిని అడ్డుకోవడానికి అడుగడుగునా సిమెంటు బారికేడ్లు, ఇనుప ముళ్ల కంచెలు పెట్టింది. కనీస మద్దతు ధర చట్టం తెచ్చేవరకు పోరాటం సాగించి తీరుతామంటూ ముందుకు వెళ్లేందుకు యత్నించిన రైతులపై పోలీసులు రబ్బర్‌ బులెట్లు, బాష్పవాయువు, జల ఫిరంగులతో తీవ్ర స్థాయిలో విరుచుకుపడి ఒక యువకుడ్ని బలిగొన్నారు. కాల్పులకు ఉసిగొలిపిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, హర్యానా సిఎం ఖట్టర్‌ నైతిక బాధ్యత వహించి తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలన్న సంయుక్త కిసాన్‌ మోర్చా డిమాండ్‌ ఎంతో న్యాయమైనది. రైతులపై దమనకాండకు పాల్పడిన పోలీసులపై సెక్షన్‌ 302 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతోపాటు ఘటనపై సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలనడమూ సహేతుకమే!

రైతులపై విశృంఖలంగా విజృంభించడమేగాక ఆ ఉద్యమాన్ని అన్నివిధాలా అణచివేయాలని కేంద్ర ప్రభుత్వం యత్నించడం దారుణం. రైతులకు అద్దెకిచ్చిన జెసిబి, ప్రొక్లెయినర్లను వాటి యజమానులు వెనక్కి తీసుకోవాలని, లేకపోతే సీజ్‌ చేస్తామని హర్యానా పోలీసులు బెదిరించడం గర్హనీయం. నిరసనతో ముడిపడి ఉన్న 177 ఖాతాలను తాత్కాలికంగా బ్లాక్‌ చేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐ.టి మంత్రిత్వశాఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఆదేశించింది. సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌) ఈ చర్యలతో తాము విభేదిస్తున్నామంటూనే దేశంలో పలువురి ఖాతాలు, పోస్టులను నిలిపేసింది. నిరసన గళాన్ని అణచివేయడానికి భారత ప్రభుత్వం ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని ఎక్స్‌ బహిరంగ ప్రకటనతో యావత్‌ ప్రపంచానికి వెల్లడయింది. ఇటువంటి చర్యలతో కేంద్ర బిజెపి ప్రభుత్వం మరింత భ్రష్టుపట్టిపోతుందే తప్ప ఉద్యమం చెక్కు చెదరదు సరికదా ‘బంతిని నేలకేసి కొడితే మరింత ఎత్తుకు ఎగిరిన’ చందంగా ముందడుగు వేస్తుందని అర్ధం చేసుకోవడం మంచిది.

కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్ల సంయుక్త వేదిక, ఎస్‌కెఎంల పిలుపు మేరకు జిల్లా, స్థానిక, గ్రామ స్థాయిలో రైతులు, కార్మికులు శుక్రవారం బ్లాక్‌ డే పాటించారు. దేశవ్యాప్తంగా పలు రూపాల్లో నిరసన తెలిపారు. న్యాయసమ్మతమైన డిమాండ్ల కోసం ఉద్యమిస్తున్న రైతులపై కేంద్ర ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా మార్చి 14న ఢిల్లీలో భారీ కిసాన్‌ మజ్దూర్‌ మహా పంచాయత్‌ నిర్వహణకు సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిచ్చింది. అబుదాబీలో డబ్ల్యుటిఓ కాన్ఫరెన్స్‌ ప్రారంభం కానున్న సందర్భంగా ఆ రోజున అంటే ఫిబ్రవరి 26న క్విట్‌ డబ్ల్యుటిఓ డేగా పాటించాలని, జాతీయ, రాష్ట్ర రహదారులపై ట్రాక్టర్లతో కవాతు నిర్వహించాలని ఎస్‌కెఎం పిలుపునిచ్చింది. ఈ విధంగా దశలవారీగా రైతు ఉద్యమం తన పరిధిని విస్తరిస్తూ ముందుకు సాగుతోంది. ప్రపంచాన్ని కబళించాలని చూస్తోన్న సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాట పదును పెంచడం ముదావహం. కేంద్ర ప్రభుత్వం ఇంకా చర్చల పేరిట కాలయాపన చేయకుండా రైతుల న్యాయమైన డిమాండ్లను ఇప్పటికైనా అంగీకరించాలి. ప్రభుత్వం సానుకూలంగా స్పందించేవరకు ఉద్యమం ఆపేది లేదని రైతు నేతలు స్పష్టం చేసినందున అది మరింత ఉధృతమవుతుంది. రానున్న ఎన్నికల్లో కార్పొరేట్‌ మతతత్వ కూటమి పాలనను కూకటి వేళ్లతో పెళ్లగిస్తుంది. జాగో మోడీ సర్కార్‌!

➡️