ఢిల్లీలో 600 ఏళ్ల పురాతన మసీదు కూల్చివేత

Feb 2,2024 10:38 #Demolition, #mosque

న్యూఢిల్లీ   :   ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే 600 ఏళ్ల పురాతన మసీదును ఢిల్లీ డెవలెప్‌మెంట్‌ అథారిటీ (డిడిఎ) అధికారులు కూల్చివేశారు. ఢిల్లీలోని మెహ్రౌలీ వద్ద బుధవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున ఆకస్మికంగా భారీ సంఖ్యలో పోలీసులను వెంటపెట్టుకుని వచ్చిన డిడిఎ అధికారులు చాలా వేగంగా మసీదును నేల మట్టం చేశారు. ఈ కూల్చివేతకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వలేదని మసీదు ఇమామ్‌ జాకీర్‌ హుస్సేన్‌ తెలిపారు.

మసీదులో ఖురాన్‌, చదువుకునే విద్యార్థుల కోసం మదర్సా, గౌరవనీయులైన వ్యక్తుల సమాధులు ఉన్నాయని, వీటిని కూడా అధికారులు నేలమట్టం చేశారని చెప్పారు. మదర్సాలో చదువుతున్న 22 మంది విద్యార్థులకు చెందిన ఆహారాలు, దుస్తులు వంటి వస్తువులను కూడా అధికారులు ధ్వంసం చేశారని ఇమామ్‌ పేర్కొన్నారు. కూల్చివేత సమయంలో తన నుంచి, ఆ ప్రాంతంలో ఉన్న ఇతర వ్యక్తుల ఫోన్లను పోలీసులు, అధికారులు బలవంతంగా లాక్కున్నారని, దీని కారణంగా మసీదు కూల్చివేతను ఎవరూ ఫోటోలు, వీడియోలు కూడా తీయలేకపోయారని తెలిపారు. మసీదు, శ్మశానవాటిక, చట్టబద్ధమైన వక్ఫ్‌ ఆస్తులను కూల్చివేయవద్దని డిడిఎకు ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఈ ఘటన జరగడం గమనార్హం. మసీదు కూల్చివేతను పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

➡️