డెలివరీ బాయ్

Feb 26,2024 08:44 #sahityam

ఆ యువకుడు

గోనె సంచి మోస్తూ

సిమెంటు అరణ్యంలో

ఇల్లిల్లూ తిరుగుతున్నాడు

ఆ బ్యాగు బరువు

ప్రపంచీకరణమంత !

 

చెమటలు కక్కుతూ

ఒక్కొక్క ప్యాకెట్‌ను స్టడీ చేస్తూ

కళ్ళ కింద గీతల్తో

కల్లోల ప్రపంచాన్ని

జల్లెడ పడుతున్నాడు

 

కంపెనీల పేర్లు ఏవైనా కానీ

ఆ వీధిలో ఇటు నుంచి ఆ చివర దాకా

బైక్‌ అతన్ని మోస్తుందా

లేక దాన్నే అతను మోస్తున్నాడా అన్నట్టు.

 

చిన్నప్పుడు

తండ్రి సైకిల్‌ మీదెక్కి

పీచు మిఠాయి కోసం

మారాము చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి.

 

తండ్రి కన్న కలల ఫలం

ఇవాళ వీధుల పాలయ్యింది

ఇది నిరుద్యోగ ఉద్యోగం

నిరాశ పడని వీరుడతడు.

‘ఈ పనికి ఎంత వస్తుంది బాబూ’ అని అడిగాను’

 

సూర్యుడితో పాటు లేస్తాను

చంద్రోదయం కూడా

నాకు వెన్నెల వేడుక కాదు

చిల్లర పైసలే కావొచ్చు

పీస్‌ కే ఇసాబ్‌ అయినా సరె

కాని చిల్లర పనిగా భావించను’

 

పని ఏదైనా కానీ

గ్లోబలైజేషన్‌

ఇవాళ వీధిలో సంచరిస్తుంది

దేశాన్ని శాసించగలిగిన యువతను

బానిసలుగా మార్చేసింది!

 

అతని వీపు అదృశ్యమయ్యే దాకా

చూస్తూనే వున్నాను

ఎందుకు వర్రీ

అమృతాంజనం బుక్‌ చేస్తానంటాడు మా అబ్బాయి

నా వర్రీ అంతా

అతని గురించే అని చెప్పాలనుంది!

– డా.ఎన్‌. గోపి

➡️