ఖలిస్థానీ మద్దతుదారుని బెదిరింపులు .. అప్రమత్తమైన ఢిల్లీ పోలీస్‌ యంత్రాంగం

న్యూఢిల్లీ    :   అమెరికాకు చెందిన ఖలిస్థానీ మద్దతుదారుడు గురుపత్వంత్‌ సింగ్‌ పన్ను బెదిరింపులతో బుధవారం ఢిల్లీ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. డిసెంబర్‌ 13న పార్లమెంటుపై దాడి చేస్తానంటూ గురుపత్వంత్‌ సింగ్‌ పన్ను ఓ విడియో సందేశాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్లమెంట్‌ సమీపంలో భద్రతను కట్టుదిట్టం చేశామని సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు. కీలక ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేస్తున్నామని అన్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. మొత్తం ఢిల్లీ వ్యాప్తంగా కూడా భద్రతను పెంచామని చెప్పారు.

గురుపత్వంత్‌ విడుదల చేసిన వీడియోలో 2001లో పార్లమెంటుపై దాడి చేసిన నిందితుడు అప్జల్‌ గురు ఫోటో కూడా ఉంది. కెనడాలో దాక్కున్న ఖలిస్తానీ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ నెల 13 న లేదా అంతకంటే ముందే భారత పార్లమెంట్‌ పై దాడి చేస్తామని హెచ్చరించాడు. ఈమేరకు ఓ వీడియో సందేశాన్ని సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశాడు. తనను చంపేందుకు భారత ఏజెన్సీలు పన్నిన కుట్రలు విఫలమయ్యాయని పేర్కొన్నాడు.

➡️