వేట నిషేధం ధిక్కరణ

ఒడిశాకు చెందిన

డొంకూరులో సముద్రంలో వేట సాగిస్తున్న ఒడిశా మత్సకారులు

  • సరిహద్దు ప్రాంతాల్లో ఒడిశా మత్స్యకారుల చేపలవేట
  • స్థానిక మత్స్యకారుల ఆందోళన

ప్రజాశక్తి – ఇచ్ఛాపురం

ఒడిశాకు చెందిన మత్స్యకారులు సముద్రంలో చేపల వేట నిషేధాన్ని యథేచ్ఛగా ధిక్కరిస్తూ వేటను కొనసాగిస్తున్నారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ఇచ్ఛాపురం మండలంలోని డొంకూరు, కవిటి మండలంలోని చిన్నకర్రివానిపాలెం, పెద్దకర్రివానిపాలెం, బట్టివానిపాలెం తదితర తీర ప్రాంతాల్లోని సముద్రంలో రెండు రోజులు వేట కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ వేట నిషేధ ఉత్తర్వులను తుంగలో తొక్కుతున్నారు. మత్స్య సంపద వృద్ధికి ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం విధిస్తుంది. సంప్రదాయ తెప్పలకి మాత్రమే చేపల వేట నిషేధం నుంచి మినహాయింపు ఉంటుంది. ఒడిశా మత్స్యకారులు మాత్రం మోటారు బోట్లపై వచ్చి వేట సాగిస్తున్నారు. దీంతో స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒడిశా మత్స్యకారుల వేట నిషేధించకపోతే తామూ వేట సాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఒడిశా మత్స్యకారులు వేట సాగించడంపై ఎఫ్‌ఎఒ రవికుమార్‌ దృష్టికి తీసుకెళ్లగా, విషయాన్ని మత్స్యశాఖ డీడీకి నివేదించి వేట నిషేధానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

➡️