ఇండియా కూటమితోనే రాజ్యాంగానికి రక్షణ

Feb 2,2024 10:34 #Constitution, #India Forum

 కేంద్రం తీరుపై పలువురు ఆగ్రహం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో  :  దేశంలో బిజెపి పాలనతో రాజ్యాంగానికి పెనుముప్పు వస్తోందని, ఇండియా కూటమి ద్వారానే రాజ్యాంగానికి రక్షణ లభిస్తుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీల హక్కులు హరించి వేస్తున్న కేంద్రం తీరుకు వ్యతిరేకంగా గురువారం విజయవాడలోని ఓ హోటల్లో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల సమావేశం జరిగింది. కేంద్ర మాజీ మంత్రి జెడి శీలం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీలైన వైసిపి, టిడిపి, జనసేన మూడుపార్టీలు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ బిజెపిని బలపరుస్తున్నాయని అన్నారు.

సిపిఎం నాయకులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీల హక్కులు కాపాడాలంటే కేంద్రంలో ఉన్న బిజెపిని ఓడించాలని కోరారు. సిపిఐ నాయకులు జల్లి విల్సన్‌ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ పూర్తి అరాచక పాలన చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు కొరివి వినరుకుమార్‌, సిరివెళ్ల ప్రసాదు, వేర్వేరు సంఘాల నాయకులు గోపీనాథ్‌, మూర్తి, కాటం నాగభూషణం, మన్నవ హరిప్రసాదు, మేళం భాగ్యారావు, నేతి మహేశ్వరరావు పాల్గొన్నారు.

➡️