జ్ఞాన్‌వాపీ మసీదు సర్వేపై నేడు నిర్ణయం

Jan 6,2024 10:45 #gyanvapi mosque, #Varanasi

వారణాసి : జ్ఞాన్‌వాపీ మసీదు కాంప్లెక్స్‌పై భారత పురావస్తు శాఖ (ఎఎస్‌ఐ) సీల్డ్‌ కవర్‌లో అందచేసిన సర్వే నివేదికపై వారణాసి కోర్టు శనివారం నిర్ణయం తీసుకోనుంది. ఈ సర్వే నివేదికను బహిరంగ పర్చడం, అలాగే హిందు, ముస్లిం తరపు పిటీషనర్లకు నివేదిక కాపీలను అందచేయడంపై శనివారం తీర్పు ఇవ్వనుంది. శుక్రవారం విచారణలో జిల్లా జడ్జి ఎకె విశ్వేష్‌ ఈ విషయాన్ని తెలిపినట్లు హిందూవుల తరపు న్యాయవాది మదన్‌ మోహన్‌ మీడియాకు వెల్లడించారు. ఉత్తర్వులను ఇంకా టైప్‌ చేయనందు వల్ల, తీర్పును శనివారం వెల్లడిస్తానని జడ్జి చెప్పినట్లు తెలిపారు. శుక్రవారం విచారణకు హిందూ, ముస్లిం తరపు న్యాయవాదులతోపాటు భారత పురావస్తు శాఖ (ఎఎస్‌ఐ) న్యాయవాదులు హాజరయ్యారు. బుధవారం విచారణలో తమ నివేదికను కనీసం నాలుగు వారాల పాటు బహిరంగ పర్చవద్దని ఎఎస్‌ఐ న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే జడ్జి బిజీగా ఉన్న కారణంగా ఈ విషయంపై గురువారం నిర్ణయం తీసుకోలేకపోయారు. 2023 జులై 21న జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలతో జ్ఞాన్‌వాపీ మసీదు కాంప్లెక్స్‌లో ఎఎస్‌ఐ శాస్త్రీయ సర్వే నిర్వహించింది. ఈ సర్వే నివేదికను సీల్డ్‌ కవర్‌లో డిసెంబరు 18న కోర్టుకు సమర్పించింది.

➡️