అలహాబాద్‌ హైకోర్టులోనే తేల్చుకోండి : జ్ఞానవాపి మసీదు కమిటీకి సూచించిన సుప్రీం

న్యూఢిల్లీ : జ్ఞానవాపి మసీదు బేస్‌మెంట్‌లో హిందూ పూజారి పూజలు చేయవచ్చంటూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై అత్యవసరంగా విచారించాలని కోరుతూ జ్ఞానవాపి మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీనిపై అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా గురువారం కమిటీకి సూచించింది. సుప్రీం కోర్టు రిజిస్ట్రార్‌ను అంజుమన్‌ ఇంతెజమియా మసీద్‌ కమిటీ ఆశ్రయించగా, ఇక్కడ కాదని హైకోర్టుకు వెళ్లాలని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ చెప్పినట్లు రిజిస్ట్రార్‌ తెలిపారు. కోర్టు ఆదేశాల ముసుగులో స్థానిక పాలనా యంత్రాంగం మసీదు వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించిందని న్యాయవాదులు నిజామ్‌ పాషా, ఫాజిల్‌ అహ్మద్‌ ఆయుబిలు పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టు వారం రోజులు సమయం ఇచ్చినా రాత్రికి రాత్రే హడావిడిగా మసీదు దక్షిణం వైపున గల గ్రిల్స్‌ను కూడా కట్‌ చేసే క్రమంలో వున్నారని తెలిపారు. మసీదు కమిటీ తమకు గల పరిష్కార మార్గాల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా చూసేందుకే స్థానిక యంత్రాంగం కక్షిదారులతో కుమ్మక్కైందని పేర్కొన్నారు.

➡️