గిరిజనం.. సమస్యలతో సతమతం

Apr 4,2024 22:03

ప్రజాశక్తి – కురుపాం : అభివృద్ధికి ఆమడ దూరంలో గిరిజన గ్రామాలు మగ్గుతున్నాయి. సదుపాయాలు అందని ద్రాక్షగా మిగిలాయి. మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధికి కోట్లాది రూపాయల విధులు వెచ్చిస్తున్నట్లు ప్రభుత్వం మాటలు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి తప్ప అభివృద్ధికి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. కురుపాం మండలంలో తిత్తిరి పంచాయతీలో గిరిశిఖర గ్రామాలైనా తులసి, పెదతులసి, చినతులసి, గుండం తదితర గ్రామాల్లో సుమారు 300 కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు రోడ్డు. తాగునీటి, గృహాలు వంటి కనీస మౌలిక సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కనీస రోడ్డు సౌకర్యం లేక కొండకోనల నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరం కాలినడకన గిరిజనులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. అనారోగ్యం బారిన పడినప్పుడు రోగులు, గర్భిణులను డోలీ సహాయంతో గిరిశిఖరాల నుంచి కిందకు దించి ఆటోల ద్వారా వైద్యం కోసం ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక పోవడంతో నిత్యావసర సరుకులను భుజంపై మోసుకుంటూ దట్టమైన అటవీ ప్రాంతం కొండ కోనల్లో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏనుగులు ఈ ప్రాంతంలో తిరుగుతుండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గ్రామాలకు వెళ్తున్నారు. అటవీ ప్రాంతం గుండా రాకపోకలు చేస్తుంచటంతో ఏ సమయంలో అడవి జంతువులు దాడి చేస్తాయోనని భయంతో రాకపోకలు సాగిస్తున్నారు. తాగునీటి సౌకర్యం లేక గిరిజనులు కలుషితమైన ఊటగడ్డ నీటిని తాగుతున్నారు.వసతులు లేక ఇబ్బందులుగృహాలు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలకు నోచక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంత మంది అధికారులు వచ్చి చూసి వెళ్లినా మా సమస్యలు పరిష్కారం కావడం లేదు. గిరిజన గ్రామాలకు రహదారి, తాగునీరు సదుపాయం కల్పించలేకపోతున్నారు. – బి. కాంతారావు, తులసి గ్రామం కాలిబాటే దిక్కు మా గ్రామానికి కనీసం రోడ్డు సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించలేదు. దీంతో మేము ఆనారోగ్యాలకు గురైనప్పుడు డోలీ మోతలతో వైద్యం కోసం తరలిస్తున్నాం. సరుకులు భుజంపై మోసుకుంటూ అటవీ మార్గం గూడా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఏనుగులు ఈ ప్రాంతంలో తిరుగుతుండడం వల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం.- ఆరిక సన్నాయి, దిగువ గుండం

➡️