1.47 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్న వరి

Dec 8,2023 08:25 #jawahar reddy, #sameeksha

– 31,498 ఎకరాల్లో ఉద్యాన పంటలు

– 3,292 గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

– 2,966 కిలోమీటర్ల రోడ్లు ధ్వంసం

– తుపాను ప్రభావిత ప్రాంతాలపై సిఎస్‌ సమీక్ష

– 11 నుండి పంటనష్టం అంచనా ప్రారంభం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్రంలో మిచౌంగ్‌ తుపాను వల్ల 1,47,795 హెక్టార్లలో వరి దెబ్బతిందని, 31,498 హెక్టార్లలో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం అంచనా వేసింది. తుపాను ప్రాంతాల్లో పరిస్థితిపై గురువారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.జవహర్‌రెడ్డి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంటల నష్టంపై అంచనాలు వేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం తుపాను వల్ల 92,577 హెక్టార్లలో వరి నీటమునగగా, 53,218 హెక్టార్లలో నేలకొరిగిందని అంచనా వేశారు. 31,498 ఎకరాల్లో అరటి, బప్పాయితోపాటు ఇతర ఉద్యాన పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లిందని నివేదిక రూపొందించారు. విద్యుత్‌ శాఖకు సంబంధించి తొమ్మిది జిల్లాల్లో 33కెవి ఫీడర్లు 210, 11కెవి ఫీడర్లు 1581, 33/11 కెవి ఫీడర్లు 353 దెబ్బతిన్నాయని తెలిపారు. 33కెవి విద్యుత్‌ స్తంభాలు 379, 11కెవి లైన్లలో 1,592 స్తంభాలు, 2,481 గృహావసర సరఫరా లైన్లకు సంబంధించిన పోల్స్‌ దెబ్బతిన్నాయని అంచనా వేశారు. 3,292 గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగగా, ఇప్పటికే 3,111 గ్రామాలకు పునరుద్ధరించామని, మిగతా 181 గ్రామాలకు విద్యుత్‌ పునరుద్ధరణ జరుగుతోందని పేర్కొన్నారు. 55 రహదారుల్లో 93.8 కిలోమీటర్ల పొడవున దెబ్బతిన్నట్లు గుర్తించారు. 2,816 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బి రోడ్లు దెబ్బతిన్నట్లు లెక్కగట్టారు. అలాగే 14 స్థానిక సంస్థల్లో 56.7 కిలోమీటర్ల రోడ్లు, 2,770 వీధి దీపాలు దెబ్బతిన్నట్లు వివరించారు. 11 నుండి ఎన్యుమరేషన్‌ తుపాను ప్రాంతాల్లో దెబ్బతిన్న వాటికి సంబంధించి 11వ తేదీ నుండి ఎన్యూమరేషన్‌ పూర్తి చేయాలని, కేంద్రానికి నివేదిక పంపించాలని సిఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో వెంటనే తాగునీరు, విద్యుత్‌, మందులు, నిత్యావసర వస్తువుల సరఫరాపై దృష్టి సారించాలని కలెక్టర్లకు సూచించారు. పొలాల్లో నిలిచిన నీటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఎన్యూమరేషన్‌ పూర్తవగానే రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించాలని, నూరుశాతం బీమా సదుపాయం వర్తింపజేయాలని సూచించారు. తడిసిన, రంగుమారిన ధాన్యం సేకరణకు సంబంధించి నిబంధనలు సడలించాలని కేంద్రానికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం : సిసిఎల్‌ఎతుపాను ప్రభావిత ప్రాంతాల్లో 1.01 లక్షల కుటుంబాలకు గాను 66,256 కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, పామాయిల్‌, ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు చొప్పున పంపిణీ చేశామని సిసిఎల్‌ఎ సాయిప్రసాదు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న 9,321 కుటుంబాలకు గాను కుటుంబానికి రూ.2,500 చొప్పున సాయం అందించాలని, ఒకే వ్యక్తి అయితే రూ.1000 చొప్పున 1,162 మందికి ఇచ్చామని మొత్తం రెండున్నర కోట్ల రూపాయలు పంపిణీ చేసినట్లు వివరించారు. సమీక్షలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె.విజయానంద్‌, బి.రాజశేఖర్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది తదితరులు పాల్గన్నారు.

➡️