దళితలను చిన్నచూపు చూస్తే ఇంటికే

Jan 15,2024 00:16

ప్రజాశక్తి – చీరాల
నియోజకవర్గంలో గణనీయంగా దళిత ఓట్లు ఉన్నప్పటికీ పెత్తనం మాత్రం అగ్రవర్ణాల చేతుల్లో ఉందని ప్రజా వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు గుమ్మడి ఏసురత్నం అన్నారు. స్థానిక మసీదు సెంటర్లోని ఆయన కార్యాలయంలో ఆదివారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. సంతనూతలపాడు, కొండేపి నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వు అయినప్పటికీ ఎమ్మెల్యే అభ్యర్థులను నిర్ణయించేది మాత్రం ఆధిపత్య సామాజిక వర్గాలేనని అన్నారు. దళితుల ఓట్లతో అధికారానికి వస్తున్న నేతలు దళితులను చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిని నిర్ణయించే సత్తా చీరాల్లో తమకు ఉందని అన్నారు. పెత్తనం మాది, ఎమ్మెల్యే పేరే మీదని, నచ్చితేనే రండి అనే నినాదంతో ప్రతి దళిత వాడను, ప్రతి వార్డుని చైతన్య పరుస్తూ బుధవారం సభ నిర్వహిస్తున్నామని అన్నారు. గత 25ఏళ్లగా నియోజకవర్గంలో దళిత యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక వలస జీవితాలు గడిపే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దళిత యువత మేల్కొని దళిత నాయకత్వాన్ని స్వాగతించే నాయకులకు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పులిపాటి రాజు, కాగిత ఆదాము, శ్యామ్, కంచర్ల రాజు, రామేశ్వరం కుమార్, దేవసహయం, జడ ఇస్సాక్ పాల్గొన్నారు.

➡️