తీర్పుపై దళిత సంఘాల హర్షం

Apr 16,2024 22:40 #Dalit, #Thota Trimurthulu

ప్రజాశక్తి- యంత్రాంగం : శిరోముండనం కేసులో ప్రధాన నిందితుడు తోట త్రిమూర్తులుకు శిక్షను విధిస్తూ తీర్పు ఇవ్వడంపై దళితులు, దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించాయి. అనంతరం విలేకర్లతో దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ కోర్టు తీర్పుకు నైతిక బాధ్యత వహించి ఎంఎల్‌సి పదవికి తోట త్రిమూర్తులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దోషులకు పార్టీ టికెట్లు ఇవ్వరాదని ఎన్నికల నిబంధనను వైసిపి అమలు చేసి త్రిమూర్తులుకు టికెట్‌ను రద్దు చేయాలని కోరారు. దళిల నాయకులు గుబ్బల శ్రీనివాసరావు, రేవు నాగేశ్వరరావు, వెంటపల్లి రామకృష్ణ, న్యూ డెమోక్రసీ నాయకులు జనిపెల్ల సత్తిబాబు, దడాల వెంకటరమణ పాల్గొన్నారు.
వైసిపి నుంచి తోట త్రిమూర్తులును సస్పెండ్‌ చేయాలి : కెవిపిఎస్‌
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచారు. కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు మాట్లాడుతూ తక్షణమే తోట త్రిమూర్తులును వైసిపి నుంచి బహిష్కరించాలని, ఎంఎల్‌ఎ టికెట్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కాకినాడ రూరల్‌ మండలం ఇంద్రపాలెం వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి కెవిపిఎస్‌, ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బెయిల్‌ను రద్దు చేయాలని నినదించారు.

న్యాయస్థానాల పట్ల మరింత నమ్మకం ఏర్పడింది : కనికెళ్ల గణపతి, బాధితుడు, వెంకటాయపాలెం
శిరోముండనం కేసులో నేర స్తులకు శిక్ష పడడం సంతోషంగా ఉంది. నా 20 ఏళ్ల వయసులో ఈ ఘటన జరిగింది. నిందితుడు తోట త్రిమూర్తులు 28 ఏళ్లగా ఈ కేసును వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు విశాఖ ప్రత్యేక న్యాయస్థానం నిందితుడిని శిక్షించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కేసు విషయంలో ఏ ప్రభుత్వమూ మాకు న్యాయం చేయలేదు. ఉద్యో గాలు ఇస్తామని నమ్మబలికి ముఖం చాటేశాయి. ఆర్థికంగానూ ఆదుకోలేదు. ఐదుగురు బాధితుల్లో ఇటీవల పూవ్వల వెంకటరమణ మృతి చెందారు. ఈ తీర్పుతో న్యాయస్థానాల పట్ల మరింత నమ్మకం ఏర్పడింది.

సరైన న్యాయం జరగలేదు :  రేవు నాగేశ్వరరావు, దళిత ఐక్య పోరాట వేదిక కన్వీనర్‌, రామచంద్రపురం
శిరోముండనం కేసులో బాధితులకు సరైన న్యాయం జరగలేదు. తీర్పు చాలా ఆలస్యమైంది. నేరస్తులు పలు కారణాలతో కేసును వాయిదాలు వేయిస్తూ వచ్చారు. నిందితుడైన తోట త్రిమూర్తులుకు నేడు పాపం పండింది. 28 ఏళ్ల ఈ కేసుకు తెరపడింది. బాధితులకు ఐదు ఎకరాలు భూమి, రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలి.

ఎంఎల్‌సి నుంచి తక్షణం తప్పించాలి : జువ్వల రాంబాబు, కెవిపిఎస్‌ రాష్ట్ర నాయకులు
శిరోముండనం కేసులో ముద్దాయిగా రుజువు కావడంతో ఎంఎల్‌సి తోట త్రిమూర్తులుకు ఎంఎల్‌సి పదవి నుంచి తప్పించాలి. వైసిపి నుంచి బహిష్కరించాలి. ఎంఎల్‌ఎ టికెట్‌ రద్దు చేయాలి.

➡️