దళిత డిక్లరేషన్‌ ప్రకటించాలి

  • అన్యాయం చేస్తున్న టిడిపి, జనసేన, వైసిపి,లకు బుద్ది చెప్పాలి
  •  కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం

ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : దళితలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించేవిధంగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు దళిత డిక్లరేషన్‌ను ప్రకటించాలని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఆదివారం విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో దళిత డిక్లరేషన్‌పై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. . కెవిపిస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఓ నల్లప్ప అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, దళిత శోషణ్‌ ముక్తి మంచ్‌ (డిఎస్‌ఎమ్‌ఎమ్‌) జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు, పౌర హక్కుల నేత పిచ్చుక శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 77 ఏళ్ల స్వతంత్ర దేశంలో నేటికీ దళితులపై నిత్యం దాడులు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. దళితులను ఓటు బ్యాంక్‌గా ఉపయోగించుకోవటమే తప్ప, వారిని కనీసం మనుషులుగా కూడా చూడటం లేదన్నారు. కేంద్రంలో బిజెపి రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా సబ్‌ప్లాన్‌ చట్టాన్ని తీసుకురాలేదని, ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్లనూ అమలుచేయటం లేదని వారు అన్నారు. మనువాద మతోన్మాద ఆర్‌ఎస్‌ఎస్‌ మోడీ వల్ల లౌకిక రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. బిజెపి ప్రభుత్వం దళితుల హక్కులను కాలారాస్తోందని అన్నారు.
రాష్ట్రంలో రోజురోజుకు దళితులపై దాడులు పెరుగుతున్నాయని చెప్పారు. బిజెపి విధానాలను పత్య్రక్షంగా, పరోక్షంగా అమలు చేస్తూ, దళితులకు అన్యాయం చేస్తున్న టిడిపి,జనసేన, వైసిపిలకు రానున్న ఎన్నికల్లో బుద్ది చెప్పి, వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులను ఎన్నుకోవాలని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు. ఎస్‌సి,ఎస్‌టిలపై దాడులు, హత్యలు, అత్యాచారాలపై కేసులను విచారించటానికి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా రౌండ్‌ టేబుల్‌ సమావేశం తీర్మానించింది. జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫార్సులు అమలుచేయాలని, ఎస్‌సి,ఎస్‌టి,విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీలను ఏర్పాటు చేసి సంఘాలకు కమిటీలలో ప్రాతినిధ్యం కల్పించాలని, కుల వివక్ష, అంటరానితనంపై ప్రభుత్వమే ప్రచారం నిర్వహించి, టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఉపాధి హామీ కింద నిధులు పెంచాలని, పనిని 100 రోజుల నుంచి 200ల రోజులకు పెంచాలని తీర్మానించారు. నిర్బంధ ఉచిత విద్యహక్కు చట్టం ప్రకారం దళిత విద్యార్థులు చదువుకోవటానికి తగిన చర్యలు తీసుకోవాలని, ఎస్టీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం ప్రకారం బడ్జెట్లో పక్కదారి పట్టించిన నిధులను కేటాయించాలని తీర్మానించారు. వీటితో పాటు మొత్తం 27 తీర్మానాలను రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో చర్చించి, తీర్మానించారు. వీటన్నింటిని కూడా అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో పొందుపరిచి, ప్రకటించాలని రౌండ్‌ టేబుట్‌ సమావేశం తీర్మానించింది. ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంఘం జోనల్‌ కార్యదర్శి గుటాల పాపారావు, జి స్వరూప్‌ దత్‌, జిఆర్‌కే పోలవరపు, గోళ్ల నారాయణరావు, దడాల సుబ్బారావు, గంజిరామారావు, తదితరులు ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు.

➡️