10న సీఎం ఆఫీస్‌ ముట్టడికి డివైఎఫ్‌ఐ పిలుపు

Jan 7,2024 16:09 #DYFI
  • డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలి

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఈనెల 10వ తేదీన సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమం జయప్రదం చేయాలని డివైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నగేష్‌ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) జిల్లా కమిటీ కార్యదర్శి నగేష్‌ సహాయ కార్యదర్శి హుస్సేన్‌ జిల్లా నాయకులు శిరీష మాట్లాడుతూ.. జగన్మోహన్‌ రెడ్డి నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పారు.. మడమ తిప్పారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ అభ్యర్థులు అనేకసార్లు నిరసనలు ప్రదర్శనలు ధర్నాలు చేసినప్పటికీ స్పందించకపోవడంతో 3వ తేదీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ముట్టడించారని తెలిపారు. అయినా సరే ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈనెల 10వ తేదీ ఈ ప్రభుత్వంతో తాడోపేడో తెలుసుకోవడానికి చలో సీఎం కార్యాలయం ముట్టడినీ తప్పనిసరి పరిస్థితుల్లో చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ముట్టడిలో ఏం జరిగినా సరే దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికైనా సరే 9వ తేదీ లోపు మెగా డీఎస్సీ విడుదల చేయకపోతే 10వ తేదీ రాష్ట్రంలోని 10 లక్షల మంది డీఎస్సీ అభ్యర్థుల యొక్క సత్తా ఏంటో జగన్మోహన్‌ రెడ్డికి రుషి చూపిస్తామని హెచ్చరించారు. నిరుద్యోగులందరూ సీఎం కార్యాలయం ముట్టడిలో పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ మేడలు వంచి మెగా డీఎస్సీ సాధించుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డివైఎఫ్‌ఐ నాయకులు వీరేష్‌, నవీన్‌, కీర్తి తదితరులు పాల్గొన్నారు.

➡️