మినీ కాదు… మెగా డిఎస్‌సి కావాలి

Feb 5,2024 10:10 #Dharna, #DYFI, #Protest
dyfi protest
  • డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్‌ ముట్టడి 
  • భారీగా తరలివచ్చిన డిఎస్‌సి అభ్యర్థులు 
  • ఉద్రిక్తత…పలువురి అరెస్ట్‌

ప్రజాశక్తి – అనంతపురం కలెక్టరేట్‌ : మినీ డిఎస్‌సి కాదు..మెగా డిఎస్‌సి కావాలని డిమాండ్‌ చేస్తూ డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో డిఎస్‌సి అభ్యర్థులు అనంతపురం జిల్లా కలెక్టరేట్‌ను శనివారం ముట్టడించారు. దీంతో కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన డిఎస్‌సి అభ్యర్థులు నగరంలోని టవర్‌క్లాక్‌ సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. తాము మెగా డిఎస్‌సి నిర్వహించాలని కోరితే ప్రభుత్వం దగా డిఎస్‌సి నిర్వహిస్తోందని ర్యాలీలో పాల్గోన్న వారు విమర్శించారు. మెగా డిఎస్‌సి కావాలంటూ చేసిన నినాదాలు మారుమ్రోగాయి. కలెక్టరేట్‌ వద్దకు చేరుకోగానే అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు వీరిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిని తోసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే భైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ చేసి అక్కడ నుండి తరలించారు. అనంతరం సొంతపూచీకత్తుపై వారిని విడుదల చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న, జిల్లా అధ్యక్షులు వై. బాలకృష్ణ మాట్లాడుతూ.. అదిగో మెగా డిఎస్‌సి అంటూ ఊరిస్తూ చివరకు మినీ డిఎస్‌సి ప్రకటించి, నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం నయవంచన చేసిందని విమర్శించారు. కేవలం 6100 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించడం సరికాదన్నారు. ఇప్పటికే మెగా డిఎస్‌సి కోసం డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక రూపాల్లో ఆందోళనలు నిర్వహించామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వందలాది మందిపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందే తప్ప మెగా డిఎస్‌సి ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్‌సి అభ్యర్థుల ఆవేదనను దృష్టిలో ఉంచుకుని నోటిఫికేషన్‌ నాటికి రిటైర్డ్‌ అవుతున్న ఉపాధ్యాయుల సంఖ్యను ఇందులో చేర్చి పోస్టులు సంఖ్యను పెంచాలని డిమాండ్‌ చేశారు. కొత్తగా రెండేళ్లు అప్రెంటిష్‌ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం దారుణమన్నారు. మెగా డిఎస్‌సి కోసం ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌సి అభ్యర్థులు పాల్గొన్నారు.

 

➡️