ప్రజాసమస్యలే అజెండాగా పనిచేస్తా:పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి డి గౌస్‌ దేశాయ్ 

ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి :అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎంను గెలిపిస్తే ప్రజా సమస్యలే అజెండాగా పనిచేస్తాం. పాణ్యం నియోజకవర్గంలో ఇప్పటికే పలు పోరాటాలు చేసి సమస్యలను పరిష్కరించాం. గెలిపిస్తే పాణ్యం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తాం’ అని సిపిఎం పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి డి గౌస్‌ దేశారు అన్నారు. ఎన్నికలు సందర్భంగా ఆయన ప్రజాశక్తి ప్రతినిధితో ముఖాముఖిగా మాట్లాడారు.

ప్రశ్న : ఏయే అంశాలతో ప్రచారంలో ముందుకు వెళుతున్నారు?
జవాబు : కల్లూరు అర్బన్‌ పరిధిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఎంఎ గఫూర్‌ సిపిఎం తరపున ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కర్నూలు నగరంలో ఎస్‌ఎస్‌ ట్యాంకు నిర్మించారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా రెండో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు నిర్మించాలని ప్రచారంలో డిమాండ్‌ చేస్తున్నాం. 2, 3 విడతల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు 20 వేల మంది ఉన్నారు. వారికి వసతులు కల్పించాలని, డబ్బులు కట్టిన టిడ్కో లబ్ధిదారులకు ఇళ్లు స్వాధీనం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. కర్నూలు నగరంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కోసం వై జంక్షన్‌ నుంచి నంద్యాల చెక్‌పోస్టు వరకు ఫ్లై ఓవర్‌ నిర్మించాలని కోరుతున్నాం. హంద్రీ, వక్కెర వాగు, సుద్దవాగుల నీరు వర్షం వస్తే ఇళ్లలోకి వస్తుంది. వాటికి కరకట్టలు నిర్మించాలని, హంద్రీకి ఇరువైపులా రోడ్లు నిర్మిస్తే ట్రాఫిక్‌ మళ్లించడానికి ఉపయోగపడుతుందని ప్రచారంలో చెబుతున్నాం. ఓర్వకల్లు ఇండిస్టియల్‌ హబ్‌లో ఇప్పటి వరకూ ఒక్క పరిశ్రమా రాలేదు. ఫార్మా, సిమెంట్‌, స్టీల్‌ పరిశ్రమలు వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. హంద్రీనీవా ద్వారా చెరువులకు నీరందించాలని, హంద్రీనీవాను వెడల్పు చేసి సాగునీరు అందించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. సోలార్‌ ప్లాంట్‌, ఎపిఐఐసి కోసం భూములిచ్చిన వారికి నష్టపరిహారం కోసం కృషి చేస్తాం.
ప్ర : పాణ్యం నియోజకవర్గంలో సిపిఎం చేసిన పోరాటాలు ఏమిటి?
పాణ్యం నియోజకవర్గం శకునాలలో సోలార్‌కు భూములిచ్చిన వారికి నష్టపరిహారం కోసం తీవ్ర పోరాటం సాగించి న్యాయమైన నష్టపరిహారం సాధించాం. కల్లూరు మండలం గ్యాస్‌ పైప్‌లైన్‌ వెళ్లిన పొలాలకు నష్టపరిహారం కోసం పోరాటం సాగించి పరిహారం ఇప్పించాం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలని పోరాటం సాగించాం.
ప్ర : ప్రజలను, ఓటర్లను ఏమని అభ్యర్థించదలిచారు?
15 ఏళ్లుగా గెలిచిన వాళ్లు పాణ్యం అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. ఎప్పుడు ఏ స్థలాన్ని ఎవరు కబ్జా చేస్తారోనని ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. కబ్జాదారుల నుంచి భూములను కాపాడుతాం. దౌర్జన్యకారుల నుంచి రక్షణ కల్పిస్తాం. ప్రజా సమస్యలే అజెండాగా పనిచేస్తాం.

➡️