ఐదుగురు సైబర్ నేరగాళ్లు అరెస్టు

Nov 24,2023 11:50 #Crimes in AP, #Cyber Crimes

ప్రజాశక్తి-అనంతపురం : అమాయక ప్రజలను వంచించి దుబాయ్ వరకు లావాదేవీలు కల్గిన సైబర్ నేరగాళ్ల ముఠాను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. అయితే సైబర్ నేరాలలో ఆరితేరిన కింగ్ పిన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు. ఈ సైబర్ నేరగాళ్లు నిరుద్యోగ యువత, అమాయక ప్రజల కష్టార్జితాన్ని క్రిప్టో కరెన్సీ రూపంలో దేశ సరిహద్దులు దాటిస్తున్నారు. ఫేక్ అకౌంట్ల ద్వారా వంచించిన సొమ్మును దుబాయ్ లో అమౌంటు విత్ డ్రా చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడించారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు అగ్రహారం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ తనకు జరిగిన సైబర్ మోసంపై జిల్లా పోలీసు కార్యాలయం స్పందనలో ఫిర్యాదు చేశారు. నమోదైన ఈ సైబర్ నేరంతో తీగ లాగితే డొంక కదలిన వైనంగా ఈ కేసు బయటపడింది. దేశ వ్యాప్తంగా ఎన్.సి.ఆర్.బి పోర్టల్ లో 1550 ఫిర్యాదులున్నాయి. వీటిలో లావాదేవీలు అంచనా వేస్తే సుమారు రూ 350 కోట్ల పైమాటేనని పోలీసులు తెలిపారు. ప్రస్తుత బాధితుడి ఫిర్యాదుకు సంబంధించి చేపట్టిన దర్యాప్తులో సైబర్ నేరగాళ్లకు చెందిన 16 ఫేక్ అకౌంట్ల ద్వారా సుమారు రూ. 35.59 కోట్లు లావాదేవీలు జరిగినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇందులో సుమారు రూ. 14.72 లక్షలు ఈ అకౌంట్ల నుండీ అనంతపురం జిల్లా పోలీసులు ఫ్రీజ్ చేయించారు. ఈ 16 ఫేక్ అకౌంట్లలో 11 నకిలీ కంపెనీల పేరున ఉన్నాయి. కింగ్ పిన్ నుండీ ప్రస్తుతం అరెస్టయిన ముఠా సభ్యులకు కమీషన్ రూపంలో రూ.20 లక్షలు చేరడం గమనార్హం. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్,ఐపిఎస్ పర్యవేక్షణలో జిల్లా పోలీస్ సైబర్ విభాగం సిబ్బంది మెరుగైన పనితీరును ప్రజలు అభినందిస్తున్నారు.

అరెస్టు నిందితుల వివరాలు

1) మహమ్మద్ సమ్మద్, నాయుడుపేట, తిరుపతి జిల్లా
2) వెంకటాచలం, వెంకటగిరి, తిరుపతి జిల్లా
3) ఎ.సందీప్, జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
4) అజయ్ రెడ్డి, శింగరాయకొండ, ప్రకాశం జిల్లా
5) సంధ్యారాణి, అనంతపురం నగరం

➡️