ఆహారధాన్యాలసాగు, ఉత్పత్తి ఈ ఏడాదే అతి తక్కువ

ఇంకా పెరగనున్న బియ్యం ధరలు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతిఅన్నపూర్ణ, ఆహారాంధ్రప్రదేశ్‌ అని ప్రభుత్వం ఒక వైపు ప్రచారం ఎత్తుకోగా మరో వైపు అదే ప్రభుత్వం ఈ ఏడాదికి వ్యవసాయోత్పత్తులపై వేసిన రెండవ ముందస్తు అంచనాల్లో ఐదేళ్లలోకెల్ల అతి తక్కువ ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉంటుందని వెల్లడించింది. వరి ఉత్పత్తి సైతం ఇప్పుడే కనిష్టంగా ఉంటుందని పేర్కొంది. 2023-24లో ఖరీఫ్‌, రబీ కలుపుకొని 85 లక్షల ఎకరాల్లో ఆహార పంటలు సాగవుతాయని, 154 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని ఎస్టిమేట్‌ చేసింది. ఐదేళ్లల్లో ఆహార ధాన్యాల సాగు, ఉత్పత్తి ఇదే కనిష్టం. ఇక ఆహార పంటల్లో ప్రధానమైన వరి పంటదీ ఇదే పరిస్థితి. ఈ సంవత్సరం రెండు సీజన్లూ కలుపుకొని 49.25 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని, 118.40 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి లభిస్తుందని ప్రభుత్వ అర్థ గణాంకశాఖ తన రెండవ ముందస్తు అంచనాల్లో తెలిపింది. కరువు, అకాల భారీ వర్షాలు, మిచౌంగ్‌ తుపాన్‌ ప్రభావంతో ఈ తడవ అతి తక్కువ ఆహార ధాన్యాల ఉత్పత్తి వస్తోంది. విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో, ముందుగా అప్రమత్తం కావడంలో, రైతులకు సహాయ సహకారాలు అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందడం వలన ఆహార ధాన్యాల సాగు, ఉత్పత్తి తగ్గుతోందని నిపుణులు విశ్లేషిసు ్తన్నారు. వరి ధాన్యం దిగుబడి తగ్గుతోందన్న సూచనల తో ఇటీవలి కాలంలో బహిరంగ మార్కెట్‌లో అమాంతం పెరుగుతున్న బియ్యం ధరలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. బియ్యం ఉత్పత్తి ఇంకా తగ్గుతున్న పక్షంలో ధరలకు మరింతగా రెక్కలొచ్చే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు తెలుపుతున్నాయి.

వైపరీత్యాల ప్రభావం

2023 ఖరీఫ్‌ను వర్షాభావం వెంటాడింది. కరువు మండలాల ప్రకటనలో ప్రభుత్వం అనావృష్టి తీవ్రతను తక్కువ చేసి చూపించింది. తుపాన్‌ నష్టం అంచనాల్లోనూ అలాగే వ్యవహరిం చింది. కానీ పంటల సాగు, దిగుబ డుల దగ్గర దాచలేకపో యింది. రబీలో ఫిబ్రవరి 7 నాటికి ఆహార ధాన్యాల సాగు ఏమంత అశాజ నకంగా లేదు. ఆహార ధాన్యాలు సాధారణ సాగులో 67 శాతమే సాగయ్యాయి. వరి 65 శాతమే సాగైంది. ప్రభుత్వం వేసిన ముందస్తు అంచనాల మేరకు కూడా పంటలు సాగయ్యే పరిస్థితి కనిపించట్లేదు.

ఇంకా తగ్గొచ్చు

రెండవ ముందస్తు అంచనాలు డిసెంబర్‌, జనవరిలో వస్తాయి. ఖరీఫ్‌ ఎస్టిమేషన్స్‌ కొంత వరకు దగ్గరగా ఉంటాయి తప్ప రబీకి సంబంధించి ఊహలుగానే ఉంటాయి. చివరాఖరుకొచ్చేసరికి ఇప్పుడు వేసిన అంచనాలు తగ్గిన సందర్భాలున్నాయి. 2021-22లో ఆహారధాన్యాల దిగుబడులు 169 లక్షల టన్నులొస్తాయని రెండవ అంచనాల్లో పేర్కొనగా తుదకు 154 లక్షల టన్నులే లభించాయి. వరి విషయానికే వస్తే 2021-22లో 135 లక్షల టన్నులొస్తాయనుకుంటే ఫైనల్‌గా 121 లక్షల టన్నులొచ్చాయి. 2022-23లో 133 లక్షల టన్నులొస్తాయని అంచనా వేయగా 126 లక్షల టన్నులే వచ్చాయి. ఈ పూర్వరంగంలో ప్రస్తుతం వేసిన రెండవ అంచనాలు చివరాఖరులోనూ ఇలాగే ఉంటాయని చెప్పలేం. కళ్లముందు కరువు, తుపాన్‌ నష్టం కనిపిస్తుండగా వరి దిగుబడి (ఈల్డ్‌)ని ప్రభుత్వం భారీగా అంచనా వేసింది. ఈ ఐదేళ్లల్లోనే అత్యధికంగా ఎకరాకు 2,404 కిలోలొస్తాయంది. ఇది అతి అంచనా అని నిపుణులు చెబుతున్నారు.

➡️