అమెరికా జోక్యందారీ విధానాలపై క్యూబా నిరసన

హవానా : క్యూబాపై క్రూరమైన ఆర్థిక యుద్ధాన్ని కొనసాగించడం, దాంతో ప్రజల్లో సహజంగానే నెలకొనే చిరాకులను ఎగదోయడం, దేశాన్ని అస్థిరపరిచే కుట్రలను అంతకంతకూ తీవ్రతరం చేయడం వంటి అమెరికా దాష్టీకాలపై క్యూబా తన తీవ్ర నిరసన తెలియజేసింది. . క్యూబన్లలో అసమ్మతిని రెచ్చగొట్టేందుకు అమెరికా ఏటా తన బడ్జెట్‌లో వందల కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నది. క్యూబా ప్రభుత్వంపై బురద చల్లేందుకు గోబెల్స్‌ ప్రచారాన్ని అమెరికా ప్రభుత్వం, క్యూబాలోని అమెరికన్‌ ఎంబసీ అదేపనిగా సాగిస్తున్నది. ఆ దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోంది. రెండు రోజుల క్రితం తూర్పు క్యూబాలోని శాంటియాగో సిటీలో నిరసనల వెనుక అమెరికా హస్తం ఉందని జోర్గెట్‌ అనే సంస్థ తెలిపింది. క్యూబా అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చుతున్నందుకు హవానాలోని అమెరికా దౌత్యాధికారి బెంజిమిన్‌ జెఫ్‌ను పిలిపించి క్యూబా ప్రభుత్వం తన నిరసన తెలిపింది. కనీస దౌత్య మర్యాదులను కూడా పాటించకుండా అమెరికా ఇదే విధంగా జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని క్యూబా విదేశాంగ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. దౌత్య సంబంధాలకు సంబంధించిన వియన్నా తీర్మానాన్ని కూడా అమెరికా గౌరవించడం లేదని క్యూబా అధ్యక్షుడు డియాజ్‌ కానెల్‌ విమర్శించారు.

నిరసనలు నిజమే కానీ..
‘నిజమే ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఎలాంటి హింసకు పాల్పడకుండా శాంతియుతంగా ఈ నిరసనలు సాగుతున్నాయి. మా పోలీసు అధికారుల ఫోటోలను ఎవరైనా చూసినట్లైతే రక్షణ కవచాలు లేకుండా, హెల్మెట్లు లేకుండా, కనీసం బాష్పవాయు గోళాలను, జల ఫిరంగులను ప్రయోగించే పరికరాలు లేకుండా ప్రజల వద్దకు వెళుతున్నారు. హింసకు పాల్పడే వారికి, అలాగే అధికారులు దృష్టి పెట్టాలని కోరుకునే వారికి మధ్య గల తేడాను కూడా మీరు గమనించాల్సి వుంటుంది.’ అని ఆయన పేర్కొన్నారు. భయంకరమైన అసత్య ప్రచారాలు, అపఖ్యాతి మూటగట్టే ప్రసారాల ద్వారా లక్షలాదిమంది అమెరికన్ల పన్నుల మొత్తాలను ఖర్చు చేస్తున్నారు. క్యూబాలోని ప్రజల అభిప్రాయాలను మార్చడానికి, క్యూబన్లలో అయోమయం, గందరగోళం సృష్టించడానికి, భయాన్ని, అభద్రతా భావాన్ని కల్పించడానికి, విప్లవ నాయకత్వం పట్ల అప నమ్మకం, అవిశ్వాసాన్ని కల్పించడానికి వారు అనేక రకాలగా ప్రయత్నం చేస్తున్నారు.
సిఐఎ లేబరేటరీల నుండి వేలాదిగా బూటకపు వార్తలను సృష్టించారు. డిజిటల్‌ సైట్‌ల ముఖ్యంగా సామాజిక నెట్‌వర్క్‌ల వ్యవహార శైలిని మనం గనుక విశ్లేషించినట్లైతే, ఇటీవలి రోజుల్లో హింసాత్మక ఘటనలకు సంబంధించిన, అవినీతి చర్యలు, ప్రజా నిరసనలకు సంబంధించిన వార్తలు అనేక రెట్లు పెరగడం చూస్తున్నాం. మరోవైపు, హవానాలోని అమెరికన్‌ ఎంబసీ ద్వారా అమెరికా భూభాగం నుండి ఉధృత ప్రచారం జరుగుతోంది. దీనిపై క్యూబా విదేశాంగ మంత్రి హుందాగా స్పందించారు. ”అమెరికా ప్రభుత్వం కనీసం గౌరవప్రదమైన, నిజాయితీతో కూడిన ప్రమాణాలను గౌరవించాల్సి వుంది.”అని విదేశాంగ మంత్రి, పార్టీ పొలిటికల్‌ బ్యూరో సభ్యుడు బ్రూనో రొడ్రిగజ్‌ ఎక్స్‌లో వ్యాఖ్యానించారు.
అమెరికా ప్రభుత్వ జోక్యందారీ వ్యవహార శైలి నేపథ్యంలో క్యూబా విదేశాంగ మంత్రిత్వ శాఖ, అమెరికా చార్జి డీ అఫైర్స్‌కు సమన్లు జారీ చేసింది. అమెరికా ప్రభుత్వ వ్యవహార ధోరణిని తీవ్రంగా నిరసిస్తున్నట్లు తెలియచేసింది. వారు కోరుకుంటున్నట్లు క్యూబా వీధుల్లో రక్తం ఏరులై పారడం లేదు. మన వీధులు, నగరాలు మంటల్లో దగ్ధం కావడం లేదు. క్యూబన్లుగా తామందరం అసత్యాలు, నిందలతో కూడిన ప్రచారాన్ని ఎదుర్కొంటూనే ఎన్నటికీ విడిచిపెట్టని పూర్తి శౌర్య పరాక్రమాలతో సమైక్యంగా వుంటూ ఎదుగుతామని చూపిస్తాం.

➡️