త్యాగాల చరిత్ర గల నేతలకు పట్టం కట్టండి

Apr 19,2024 23:38 #BABURAO NAMINATION

– ఇండియా వేదిక నేతల పిలుపు
– సిపిఎం విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్‌.బాబూరావు నామినేషన్‌
ప్రజాశక్తి – విజయవాడ:రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలంటే త్యాగాల చరిత్ర కలిగిన కమ్యూనిస్టులకు ఓటు వేసి గెలిపించాలని, ఇండియా వేదిక అభ్యర్థులను చట్ట సభలకు పంపాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌, సిపిఐ, ఆమ్‌ ఆద్మీ, ఆర్‌జెడి, ఇండియా వేదిక బలపరచిన సిపిఎం విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌కు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. దీనికి ముందు అజిత్‌సింగ్‌నగర్‌ పైపుల రోడ్డు సెంటర్‌ నుండి ధర్నా చౌక్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆయా సెంటర్లలో ప్రజలు, ప్రజా సంఘాల నేతలు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ముందుగా పైపుల రోడ్డు సెంటర్‌లో జరిగిన సభలో సిపిఎం రాష్ట్ర పూర్వ కార్యదర్శి, మాజీ ఎంపి పి.మధు మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి ప్రభుత్వ పాలనలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికతత్వం ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. విమానాశ్రయాలు, పోర్టులు, పరిశ్రమలు, ఇతర దేశ సంపద మొత్తాన్ని అదానీ, అంబానీలకు కారుచౌకగా కట్టబెడుతోందని వివరించారు. కేంద్రంలో మళ్లీ బిజెపి అధికారంలోకొస్తే దానికి ప్రత్యక్షంగా మద్దతిస్తున్న టిడిపిని, పరోక్షంగా మద్దతిస్తున్న వైసిపిని మింగేస్తుందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ త్యాగాలు చేసే కమ్యూనిస్టులను గెలిపించాలని కోరారు. ప్రజల మధ్య ఉండే బాబూరావును చట్ట సభలకు పంపాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న బాబూరావుపై గత పదేళ్లలో 73 కేసులు నమోదయ్యాయని, వీటిలో ఏ ఒక్కటీ ఆయన వ్యక్తిగతమైనవి కాదని తెలిపారు. ఇవే బాబూరావు విశిష్టతను, ప్రతిష్టను తెలియజేస్తోందన్నారు. సిపిఎస్‌ను రద్దు, ఒపిఎస్‌ విషయంలో అధికార వైసిపి, టిడిపిలు గత పదేళ్ల కాలంలో మడమతిప్పాయని గుర్తు చేశారు. రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్‌, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రానికి మూడు రాజధానులంటూ వైసిపి, తాత్కాలిక అసెంబ్లీ, హైకోర్టు అంటూ టిడిపి… రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయని విమర్శించారు. కేంద్రంలోని బిజెపి దుష్ట విధానాలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ ఇండియా వేదిక అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని తమ అధినేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారన్నారు. సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌ పార్టీ రాష్ట్ర నాయకులు హరినాథ్‌ మాట్లాడుతూ.. కేంద్రంలోని ఫాసిస్టు బిజెపిని గద్దెదించకపోతే రాజ్యాంగం మంటగలుస్తుందన్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకులు పరమేశ్వరరావు మాట్లాడుతూ నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ, వారి సమస్యలపై నిరంతరం పని చేస్తున్న బాబూరావును గెలిపించుకోవాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాధ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు చలసాని శ్రీనివాసరావు, సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డివి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️