మెడికవర్‌లో క్లిష్టమైన గుండె ఆపరేషన్‌ విజయవంతం

ప్రజాశక్తి -నెల్లూరు : నగరంలోని మెడికవర్‌ హాస్పిటల్‌లో అత్యంత క్లిష్టమైన గుండె శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించామని మెడికవర్‌ కార్డియాలజీ నిపుణులు డాక్టర్‌ సంజీవ్‌ సురేష్‌, మత్తు డాక్టర్‌ వెంకటరమణ చౌదరి తెలిపారు. బుధవారం హాస్పిటల్‌లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కడప జిల్లాకు చెందిన 52 ఏళ్ల పుల్లారెడ్డి అనే వ్యక్తి గుండెలో మంట, ఆయాసంతో బాధపడుతూ… ఛాతి నొప్పి అధికంగా రావడంతో కడపలోని ఓ హాస్పిటల్‌ను సంప్రదించారన్నారు.. అక్కడి వైద్యులు ఈసీజి, 2డి ఎకో, తదితర గుండె సంభందించి పరీక్షలు నిర్వహించి గుండెకు సంభందించిన సమస్య తీవ్రంగా ఉందని గుర్తించి యాంజియోగ్రామ్‌ చేయించగా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నరాలు ఎడమవైపు 95 శాతం, కుడివైపు 100 శాతం మూసుకుపోయాయని నిర్ధారించారు. ఎమర్జెన్సీగా బైపాస్‌ సర్జరీ చేయాలని వైద్యులు తెలియజేశారు. అయితే కడపలో ఎమర్జెన్సీ వైద్యం అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు పుల్లారెడ్డిని నెల్లూరులోని మెడికవర్‌ హాస్పిటల్‌కు అప్పటికప్పుడు తీసుకొచ్చారు. మెడికవర్‌ కార్డియాలజీ నిపుణులు డాక్టర్‌ సంజీవ్‌ సురేష్‌, మత్తు డాక్టర్‌ వెంకట రమణ చౌదరి వైద్య పరీక్షల వివరాలను పరిశీలించి, బైపాస్‌ సర్జరీ చేయాలని, గుండెకు రెండు వైపులా రక్తాన్ని సరఫరా చేసే నరాలు దాదాపుగా మూసుకుపోయిన నేపద్యంలో ఆపరేషన్‌ ఎంత క్లిష్టమైందో రోగి కుటుంబసభ్యులకు తెలియజేయగా వారు ఆపరేషన్‌ నిర్వహణకు అంగీకరించారు. దీంతో డాక్టర్‌ సంజీవ్‌ సురేష్‌ వైద్య బృందం అత్యవసరంగా గుండెకు బైపాస్‌ సర్జరీని విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. రోగి కేవలం రెండు రోజుల్లోనే పూర్తిగా కోలుకున్నాడని.. 5 రోజుల్లోనే డిశ్చార్జ్‌ అయినట్లు తెలిపారు.

➡️