గాజాలో సంక్షోభం తీవ్రతరం

Jan 30,2024 11:06 #crisis, #Gaza

 నిలిచిపోయిన మానవతా సహాయం

గాజా సిటీ :    గాజాలో సంక్షోభం తీవ్రతరమవుతోంది. ఇజ్రాయిల్‌ అణచివేత మధ్య మానవతా సహాయం కూడా నిలిపేశారు. పాలస్తీనా శరణార్థులకు సహాయం అందించే ఐక్యరాజ్యసమితి సహాయక చర్యల సంస్థ (యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ) కు బ్రిటన్‌ నిధులను నిలిపివేసింది. అక్టోబర్‌ 7న హమాస్‌ జరిపిన దాడిలో యుఎన్‌ఆర్‌డబ్ల్యు సిబ్బంది ప్రమేయం ఉందని ఇజ్రాయెల్‌ ఆరోపించిన నేపథ్యంలో బ్రిటన్‌ ఈ చర్య తీసుకుంది. అంతకుముందు అమెరికా, ఆస్ట్రేలియా, ఇటలీ, కెనడా, ఫిన్‌లాండ్‌, నెదర్లాండ్స్‌, జర్మనీ, స్విట్జర్లాండ్‌ దేశాలు కూడా నిధులు నిలిపేశాయి. ఈ నిర్ణయం గాజాను సంక్షోభంలో పడేస్తుంది. పాలస్తీనా కోసం ప్రధాన సహాయ సంస్థకు నిధులు స్తంభింపజేయడంతో గాజాలో మానవతా సంక్షోభం మరింత తీవ్రతరమయ్యే అవకాశముంది. గాజాలోని 23 లక్షల మందిలో 20 లక్షల మంది ఈ సహాయక సంస్థపై ఆధారపడి ఉన్నారు. కమిషనర్‌ జనరల్‌ ఫిలిప్పీ లజారినీ స్పందిస్తూ, ఐరాస ఏజెన్సీకి నిధులు నిలిపేయడం దిగ్భ్రాంతికి గురి చేసందని అన్నారు. ఇది పాలస్తీనా ప్రజలను మొత్తంగా శిక్షించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ సహాయాన్ని తిరిగి ప్రారంభించాలని పిలుపునిచ్చారు.

ఐసిజె తీర్పు తరువాత 165 మంది పాలస్తీనీయులను బలిగొన్న ఇజ్రాయిల్‌

గాజాలో మారణహౌమం ఆపడానికి అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాన్ని ఇజ్రాయెల్‌ ధిక్కరించింది. గడచిన 24 గంటల్లో 165 మంది ప్రాణాలు హరించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో గాజాలో మృతుల సంఖ్య 26,422కి చేరింది. ఇజ్రాయెల్‌ బాంబు దాడిలో ఖాన్‌ యూనిస్‌ నగరం మొత్తం ధ్వంసమైంది. ఖాన్‌ యూనిస్‌లోని నాజర్‌ హాస్పిటల్‌ యార్డ్‌లో 30 మంది శిశువుల మృతదేహాలను పాతిపెట్టిన దశ్యాలు బయటపడ్డాయి. అదే సమయంలో, అసోసియేటెడ్‌ ప్రెస్‌ గాజాలో కాల్పుల విరమణ కోసం జరుగుతున్న చర్చల్లో పురోగతి ఉందని అమెరికన్‌ అధికారులను ఉటంకిస్తూ నివేదించింది.

➡️