నేరాలు పెరిగిపోతున్నాయి

Dec 5,2023 10:46 #Crimes, #details, #increasing
  • ఎక్కువగా మహిళలు, చిన్నారులపైనే
  • ఎస్‌సిలు, ఎస్‌టిలపై కూడా…
  • ఆత్మహత్యలు, ప్రమాద మరణాలూ పెరిగిపోయాయి
  • జాతీయ క్రైమ్‌ బ్యూరో నివేదిక విడుదల

న్యూఢిల్లీ : గత సంవత్సరం దేశంలో మహిళలు, చిన్నారులు, ఎస్‌సిలు, ఎస్‌టిలపై నేరాలు పెరిగాయి. సైబర్‌ నేరాల సంఖ్యా అధికంగానే ఉంది. ఆకస్మిక మరణాలు, ఆత్మహత్యలు కూడా ఎక్కువగానే చోటుచేసుకున్నాయి. ఇవేవో ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలు కావు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) ఆదివారం విదుదల చేసిన వార్షిక నేరాల నివేదికలోని చేదునిజాలు. దేశంలో 2022లో జరిగిన వివిధ రకాల నేరాల చిట్టాను ఈ నివేదిక బయటపెట్టింది. 2021తో పోలిస్తే గత సంవత్సరంలో మొత్తం మీద నేరాల రేటు 7శాతం నుంచి 6.9శాతానికి తగ్గిందని నివేదిక తెలిపింది. మహిళలు, పిల్లలు, ఎస్‌సిలు, ఎస్‌టిలపై నేరాలతోపాటు సైబర్‌ నేరాలు పెరిగాయి.

ప్రమాదాల కారణంగా జరిగిన మరణాలు, ఆత్మహత్యలకు సంబంధించిన నివేదికను (ఎడిఎస్‌ఐ) కూడా ఎన్‌సిఆర్‌బి విడుదల చేసింది. దీని ప్రకారం 2021తో పోలిస్తే 2022లో ఆకస్మిక మరణాల సంఖ్య 11.6శాతం పెరిగింది. గత సంవత్సరంలో 56,653 మంది హఠాత్తుగా చనిపోయారు. వీరిలో గుండెపోటు కారణంగా 32,410 మంది ప్రాణాలు కోల్పోగా, 24,243 మరణాలకు వేర్వేరు కారణాలు ఉన్నాయి. 45-60 సంవత్సరాల మధ్య వయస్కులు ఎక్కువగా… అంటే 19,456 మంది మరణించారు. భారత వైద్య పరిశోధనా మండలి, రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అధ్యయనం ప్రకారం ప్రపంచంలో గుండె జబ్బులతో బాధపడుతున్న వారిలో 60% మంది మన దేశంలోనే ఉన్నారు.

ఈ మరణాలూ అధికమే

ఆత్మహత్యలకు పాల్పడిన వారి సంఖ్య 2021తో పోలిస్తే గత సంవత్సరం 1,64,033 నుంచి 1,70,924కు పెరిగింది. ఇదే కాలంలో ప్రమాద మరణాల సంఖ్య 3,97,530 నుంచి 4,30,504కు పెరిగింది. భారత చరిత్రలో ఆత్మహత్యల రేటు 2021లోనే అత్యధికంగా నమోదైంది. ఆ సంవత్సరం ప్రతి లక్ష మందిలో 12 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చునని అంచనా. ఆత్మహత్యల కేసులు పూర్తి స్థాయిలో వెలుగు చూడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మరణ ధ్రువపత్రం లభించకపోవడం, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వాస్తవాలు బయటపెట్టకపోవడం, ఆత్మహత్యల సమాచారాన్ని వెల్లడించకపోవడం, ఆత్మహత్య చేసుకుంటే బీమా సొమ్ము అందకపోవడం వంటి కారణాల రీత్యా కేసులు పెద్దగా బయటపడడం లేదు.

2021లో అత్యధికం

గత సంవత్సరంలో మహిళలపై నేరాలకు సంబంధించి కనీసం 4.45,256 కేసులు నమోదయ్యాయి. 2021తో పోలిస్తే ఇది 4% ఎక్కువ. వీటిలో భర్త లేదా అతని బంధువుల దాష్టీకం, అపహరణలు, దాడులు, వేధింపులు, అత్యాచారాలే అధికంగా ఉన్నాయి. ప్రపంచంలో ప్రతి ముగ్గురు మహిళలలో ఒకరు లింగ వివక్షకు, హింసకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థను ఉటంకిస్తూ బిబిసి తెలిపింది. మన దేశంలో కూడా ఈ సంఖ్య అలాగే ఉంది. 2021లో దేశంలో అత్యధిక సంఖ్యలో మహిళలపై నేరాలు జరిగాయి. 2016 నుండి జరిగిన నేరాలతో పోలిస్తే ఇవి 26.35% ఎక్కువ.

చిన్నారులు, వృద్ధులు, ఎస్‌సిలు, ఎస్‌టిలపై కూడా…

చిన్నారులపై జరుగుతున్న నేరాలలో కూడా పెరుగుదల కన్పించింది. 2022లో ఈ తరహా నేరాలు 1,62,449 చోటుచేసుకున్నాయి. 2021తో పోలిస్తే ఇవి 8.7శాతం అధికం. ఇక వృద్ధులు, ఎస్‌సిలు, ఎస్‌టిలపై నేరాలు, ఆర్థిక నేరాలలో కూడా గణనీయమైన పెరుగుదల కన్పించింది. 60 సంవత్సరాలు దాటిన వారిపై జరిగిన నేరాలకు సంబంధించి 28,545 కేసులు నమోదయ్యాయి. 2021తో పోలిస్తే ఇవి 9.3% ఎక్కువ. ఎస్‌సిలపై నేరాలకు సంబంధించి 57,582 కేసులు (2021లో కంటే 13.1% అధికం) నమోదయ్యాయి. ఎస్‌టిలపై 10,064 నేరాల కేసులు (2021లో కంటే 14.3శాతం ఎక్కువ) నమోదయ్యాయి. ఆర్థిక అవకతవకలకు సంబంధించి కనీసం 1,93,385 (2021లో కంటే 11.1 శాతం ఎక్కువ) కేసులు, సైబర్‌ నేరాలకు సంబంధించి 65,893 (2021లో కంటే 24.4 శాతం అధికం) కేసులు నమోదయ్యాయని నివేదిక వివరించింది. వీటితో పాటు 3,434 లైంగిక దోపిడీ కేసులు కూడా నమోదు చేశారు.

➡️