యుపిలో మహిళలపై నేరాలు అధికం

– ఏకంగా 55 శాతం నేరాలు

– వేధింపుల కేసులే అధికం

– జాతీయ మహిళా కమిషన్‌ వెల్లడి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో దేశంలో మహిళలపై అత్యధిక నేరాలు ఉత్తరప్రదేశ్‌లోనే జరుగుతున్నాయి. దేశం మొత్తం మహిళలపైన జరిగిన నేరాల్లో 55 శాతం ఒక్క ఉత్తరప్రదేశ్‌లో జరిగాయి. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సిడబ్ల్యు) గతేడాది మహిళలపై నేరాలకు సంబంధించి నివేదిక విడుదల చేసింది. దేశం మొత్తం మహిళలపై నేరాలకు సంబంధించి 28,811 ఫిర్యాదులు నమోదయ్యాయని, అందులో 55 శాతం ఉత్తరప్రదేశ్‌కు చెందినవని పేర్కొంది.ఎన్‌సిడబ్ల్యు డేటా ప్రకారం.. గృహ హింస కాకుండా వేధింపులతో కూడిన గౌరవ హక్కు కేటగిరిలో అత్యధిక సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. వేధింపులతో కూడిన గౌరవ హక్కు 8,540 కేసులు నమోదయ్యాయి. దీని తర్వాత గృహ హింసపై 6,274 ఫిర్యాదులు అందాయి. వరకట్న వేధింపుల ఫిర్యాదులు 4,797, వేధింపుల ఫిర్యాదులు 2,349, మహిళలపై పోలీసు ఉదాసీనత 1,618, అత్యాచారం, అత్యాచారానికి ప్రయత్నించిన ఫిర్యాదులు 1,537గా నమోదయ్యాయి. లైంగిక వేధింపులపై 805 ఫిర్యాదులు, సైబర్‌ క్రైమ్‌లపై 605, స్టాకింగ్‌పై 472, గౌరవ నేరాలకు సంబంధించి 409 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 16,109, ఢిల్లీలో 2,411, మహారాష్ట్రలో 1,343 ఫిర్యాదులు నమోదయ్యాయి. బీహార్‌లో 1,312, మధ్యప్రదేశ్‌లో 1,165, హర్యానాలో 1,115, రాజస్థాన్‌లో 1,011, తమిళనాడులో 608, పశ్చిమ బెంగాల్‌లో 569, కర్ణాటకలో 501 ఫిర్యాదులు నమోదయ్యాయి. 2022 నుండి 30,864 ఫిర్యాదులు అందగా, 2023లో 28,811 ఫిర్యాదులు నమోదయ్యాయి.

➡️