సంజయ్ సింగ్‌ను ఎంపిగా ప్రమాణం చేసేందుకు అనుమతించిన కోర్టు

న్యూఢిల్లీ   :   ప్రస్తుతం జైలులో ఉన్న ఆప్‌ నేత సంజయ్  సింగ్‌ వరుసగా రెండో సారి రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేసేందుకు ఢిల్లీ కోర్టు మంగళవారం అనుమతించింది. ఫిబ్రవరి 8 లేదా 9 తేదీల్లో ప్రమాణం చేసేందుకు అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై రోస్‌ అవెన్యూ కోర్ట్‌ స్పెషల్‌ జడ్జి ఎం.కె. నాగ్‌పాల్‌ విచారణ చేపట్టారు. లిక్కర్‌ స్కామ్‌ ఆరోపణలపై గతేడాది అక్టోబర్‌లో సంజయ్ సింగ్‌ను ఇడి అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఎంపిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఫిబ్రవరి 5న సంజయ్ సింగ్‌ను రాజ్యసభ వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. అయితే సభ కార్యకలాపాలలో జాబితా చేయనందున పార్లమెంట్‌ ఆయనకు అనుమతి నిరాకరించింది. సంబంధిత జైలు సూపరింటెండెంట్‌కి ఇమెయిల్‌ ద్వారా కమ్యూనికేట్‌ చేయవచ్చని అభ్యర్థి తరుపు న్యాయవాదికి కోర్టు తెలిపింది. ఆరోజు ఉదయం 10.00 గంటలకు సంజయ్ సింగ్‌ను రాజ్యసభకు తీసుకువెళ్లి .. తిరిగి జైలుకు సురక్షితంగా తీసుకురావాల్సిందిగా ఆదేశించింది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంజయ్ సింగ్‌ కుటుంబసభ్యులు, న్యాయవాదులను కూడా హాజరుకావచ్చని ఆదేశించింది.

ప్రత్యేకాధికారాల కమిటీ నివేదిక సమర్పించి, ఆ నివేదికపై సభ నిర్ణయం తీసుకునే వరకు సంజయ్ సింగ్‌ సస్పెన్షన్‌ కొనసాగుతుందని ఎగువ సభ 2023 ఆగస్టు 11న ఉత్తర్వులు జారీ చేసిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కమిటీ సమావేశ తేదీని ఇప్పటివరకు ప్రకటించలేదు. ఒకవేళ సస్పెన్షన్‌ను రద్దు చేసినట్లయితే, రాజ్యసభ సెక్రటేరియట్‌ సంజయ్ సింగ్‌కు ప్రమాణం చేయవలసిందిగా సమన్లు జారీ చేస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. అయితే ఆయనకు సమన్లు జారీ చేయలేదని పేర్కొన్నాయి. లిక్కర్‌ పాలసీ కేసులో గత కొన్ని నెలలుగా జైలులోనే ఉన్న సీనియర్‌ ఆప్‌ నేతల్లో సంజయ్ సింగ్‌ ఒకరు.

➡️