2023 : మిజోరంలో కొనసాగుతోన్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ..

మిజోరం : మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ సోమవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఆదివారం వెలువడగా.. మిజోరం ఫలితాలు మాత్రం ఈరోజు వెలువడనున్నాయి. అయితే, మిజోరం ప్రజలు ఆదివారం ధార్మిక కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనిస్తుంటారు. ఈ నేపథ్యంలో … ప్రజలు, వివిధ సంస్థల కోరిక మేరకు 3వ తేదీన కాకుండా నాలుగవ తేదీన కౌంటింగ్‌ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది.

మొత్తం 13 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని మిజోరాం రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి హెచ్‌.లియాంజెలా తెలిపారు. ఈ రాష్ట్రంలో మొత్తం 8.57 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 80శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 174 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగారు.

40 మంది ఎమ్మెల్యేలున్న మిజోరం అసెంబ్లీకి నవంబర్‌ 7 న ఎన్నికలు జరిగాయి. 174 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అధికారం చేపట్టాలంటే కనీసం 21 స్థానాలు సాధించాలి. ఏ పార్టీకీ సొంతంగా పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు లేనపోవడంతో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌లో తేలింది.మిజో నేషనల్‌ ఫ్రంట్‌ అధినేత జోరంతంగా గెరిల్లా నాయకుడు. భారత ప్రభుత్వం నుంచి తప్పించుకుని మయన్మార్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, చైనా దేశాల సరిహద్దుల్లో తలదాచుకున్నాడు. చివరిగా 1986లో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంతో ఆయన లాల్‌డేంగా కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు

➡️