పాత అసెంబ్లీ భవనంలోనే కౌన్సిల్‌ సమావేశాలు : రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌: మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ)లోని ఖాళీ స్థలాన్ని ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజాభవన్‌లో ఉన్న ఆఫీసు కార్యాలయాన్ని కూడా ఉపయోగించుకుంటామన్నారు. ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో ఉన్న ఖాళీ స్థలంలో సీఎం క్యాంపు ఆఫీసు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని స్పష్టం చేశారు. శాసనసభ భవనాలను సమర్థంగా వినియోగించుకుంటామన్నారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాగుకు 12.. 14 గంటలకు మించి విద్యుత్‌ ఇవ్వలేదని చెప్పారు. శ్వేతపత్రం సహా అన్ని అంశాలపై అందరితో చర్చించి సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామన్నారు. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రో ఉపయోగకరంగా ఉండదని, మరో రూట్‌లో మెట్రో ప్లాన్‌ చేస్తామని సీఎం వెల్లడించారు.”శుక్రవారం బీఏసీ సమావేశం ఉంటుంది. శాసనసభ సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటాం. పాత అసెంబ్లీ భవనంలోనే కౌన్సిల్‌ సమావేశాలు జరుగుతాయి. ఇప్పుడు ఉన్న అసెంబ్లీ భవనంలోనే శాసనసభ సమావేశాలు నిర్వహిస్తాం. పార్లమెంట్‌ తరహాలో అసెంబ్లీ ఉండబోతోంది” అని సీఎం వివరించారు.

➡️