చల్లబడిన వాతావరణం .. తెలంగాణలో వర్షాలు

Mar 19,2024 09:59 #Cooled weather, #rains, #Telangana

తెలంగాణ : తెలంగాణలో మంగళవారం తెల్లవారుజామునుండే వర్షం కురుస్తోంది. ఈరోజు ఉదయం దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, సరూర్‌నగర్‌, కర్మాన్‌ఘాట్‌, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, హయత్‌ నగర్‌, చార్మినార్‌, కోఠి పలు చోట్ల వర్షం కురుస్తోంది. ఇక, కామారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఎండ ఉక్కపోతతో బాధపడిన నగరవాసులు ఉపశమనాన్ని పొందారు.

రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లోని పలుజిల్లాల్లో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

వర్షాల నేపథ్యంలో … మెదక్‌ జిల్లాలో విషాదం జరిగింది. కౌడిపల్లి మండలం జాబితాండలో అకాల వర్షం, ఈదురు గాలుల కారణంగా ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి సంగీత చనిపోయింది. ఇక, ఈదురు గాలల వర్షం కారణంగా పలుచోట్ల రైతులకు తీవ్ర నష్ట వాటిల్లింది. గాలుల కారణంగా మామిడి పూత, కాయలు రాలిపోయాయి. అలాగే, వరి పంట, మొక్కజన్న పంటలకు నష్టం జరిగింది.

➡️